చిరంజీవితో రాంచందర్‌రావు భేటీ
- విశేష్ జన సంపర్క్ అభియాన్‌లో భాగంగా కలిశానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకం అందజేత
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : సినీనటుడు చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో రాంచందర్‌రావు కలిశారు. ప్రధాని నరేం ద్ర మోదీ నాయకత్వంలో వికాస్, విశ్వాస్, జన కల్యాణ్ లక్ష్యాలతో సాగుతున్న 12 సంవత్సరాల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న విశేష్ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
గత 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం సాధించిన ము ఖ్యమైన విజయాలు, మైలురాళ్లు, దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లిన పలు కీలక కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి ఆయన అందజేశారు. ఈ సమావేశంలో సమాజం, సంస్కృతి, సినీ రంగం, జాతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
అలాగే అభివృద్ధి, సుపరిపాలన, ప్రజాసంక్షేమ పథకాల పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతను చిరంజీవికి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీరేందర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు.






