calender_icon.png 28 October, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప శిల్పకళా నైపుణ్యం అద్భుతం

25-10-2025 07:36:24 PM

త్రిపుర ఈఆర్సీ చైర్మన్ హేమంత్ వర్మ

వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): రామప్పలోని ప్రతి ఒక్క శిల్పం ఆనాడు నిర్మించిన కాకతీయుల కళ నైపుణ్యానికి అద్దం పడుతుందని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ అన్నారు. పర్యాటక క్షేత్రాలను  వీక్షించడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ దంపతులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకోగా.. అనంతరం ఆలయ అర్చకులచే శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గైడ్ రామప్ప చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ హేమంత్ వర్మ మాట్లాడుతూ.. రామప్ప శిల్పాలలో కళాత్మక వైభవం ఉట్టిపడుతున్నట్లు నిర్మించారని, యునెస్కో గౌరవం దక్కిన రామప్ప రాతిపై చెక్కిన ఇక్కడి శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోందని అన్నారు. చరిత్ర భవిష్యత్ తరాలకు ఎన్నో అంశాలను తెలియజేస్తుందని, జీవకళ ఉన్న శిల్పకళాకృతులకు మరో రూపమే రామప్ప అని కితాబు ఇచ్చారు. ఎంతో ఘన చరిత్ర గల రామప్పను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం లక్నవరం సస్పెన్షన్ వంతెన పై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు.