రాక్షసుడిగా రణ్‌వీర్!

30-04-2024 12:05:00 AM

‘హనుమాన్’ చిత్ర విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమంతుడి అంత బలం వచ్చినట్టుంది. ఊహించని రీతిలో అనూహ్య విజయాన్ని పొందిన ఈ చిత్రం ఆయనకు అనేక అవకాశాలను తెచ్చిపెడుతోంది. భారత చిత్ర పరిశ్రమలోని కొందరు అగ్ర నటులు సైతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమయ్యేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి అగ్రనటుల పేర్లు తెరపైకి రాగా, ఇటీవల జరిగిన వంద రోజుల వేడుకలో “మీరు వింటున్నవన్ని నిజమే” అని వాటికి మరింత మద్దతు పలికారాయన. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నది బాలీవుడ్  హీరో రణ్‌వీర్ సింగ్ పేరు. ప్రశాంత్ వర్మ కలయికలో సినిమా ఖాయమైందని మీడియాలో కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే రణ్‌వీర్, ప్రశాంత్ వర్మ చిత్రంలో రాక్షసుడి  పాత్రలో కనపడనున్నారట. అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిధులు చేకూర్చనున్న ఈ సినిమాకి ‘రాక్షస’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్నీ సక్రమంగా జరిగితే ‘హనుమాన్’ సీక్వెల్ అయిన ‘జై హనుమాన్’ చిత్రం కంటే ఈ సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళ్ళనుంది.