04-07-2025 12:13:39 AM
తల్లి, ఇద్దరు పిల్లలను కాపాడిన వైద్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): బంజారాహిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన, ప్రాణాంతక గర్భధారణ సమస్యకు విజయవంతంగా చికిత్స అందించి తల్లి, ఇద్దరు శిశువులను సురక్షితంగా కాపాడారు. జహీరాబాద్‌కు చెందిన ఆయేషా సిద్ధికా (29) 28 వారాల గర్భంతో ఉంది. ఆమెలో ప్లసెంటా పెర్క్రేటా అనే తీవ్రమైన సమస్య కనిపించింది.
ఇది గర్భాశయాన్ని దాటి మూత్రాశయం, సర్విక్స్ (గర్భాశయ ముఖం) వరకు పెరిగే అరుదైన స్థితి. ఆయేషాకు తరచూ రక్తస్రావంతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారు. మొదట అల్ట్రాసౌండ్‌లో అనుమానాస్పద ప్లసెంటా సమస్యలు కనిపించగా, ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా గ్రేడ్ IV ప్లసెంటా ప్రీవియా, ప్లసెంటా పెర్క్రేటా నిర్ధారణ అయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 50 వేల మందిలో ఒక్క గర్భిణీకే ఈ సమస్య వస్తుంది.
మొదటగా, రక్తస్రావాన్ని నియంత్రించేందుకు డాక్టర్ అవినాశ్ దాల్ (సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్), క్యాథ్ ల్యాబ్‌లో రెండు కామన్ ఇలియాక్ ఆర్టరీల్లో బాలూన్ క్యాథెటర్లు వేశారు. ఆ తర్వాత డాక్టర్ శృతి పలకొళ్ల, డాక్టర్ సుధ (గైనకాలజీ, అబ్ట్సెక్రిక్స్ కన్సల్టెంట్లు) శస్త్రచికిత్స ప్రారంభించారు.
ఆయేషాకు కిలో బరువు మగ శిశువు, 760 గ్రాముల ఆడ శిశువు విజయవంతంగా జన్మించారు. వెంటనే బెలూన్ల ను వేగంగా వ్యాపింపజేసి రక్తస్రావాన్ని నియంత్రించారు. డాక్టర్ హిదాయతుల్లా (సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ), డాక్టర్ రాజేష్ పర్యవేక్షణలో చికిత్స విజయవంతమైంది.
డాక్టర్ డీవీఎల్ నారాయణ రావు (సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ), డాక్టర్ అనిల్ జంపాని (కన్సల్టెంట్ సర్జన్), డాక్టర్ ఏడుకొండలు (సీనియర్ కన్సల్టెంట్ అనస్థీషియా, క్రిటికల్ కేర్), డాక్టర్ సందీప్ (కన్సల్టెంట్ అనస్థీషియా & క్రిటికల్ కేర్), డాక్టర్ శ్రీకాంత్ వొడ్నాల తదితరులు ఆపరేషన్‌లో భాగస్వామ్యులయ్యారు.
తమ హాస్పిటల్‌లో రోగులకు అధునా తన పద్ధతుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్టు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కీర్తికారెడ్డి, ఎండీ దీపక్‌రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రరెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ వొడ్నాల, యూనిట్ హెడ్ నవ్య తదితరులు పేర్కొన్నారు.