04-07-2025 01:35:59 AM
సంగారెడ్డి, జూలై 3 (విజయక్రాంతి) /పటాన్‌చెరు: ఆ ప్రాంతమంతా కన్నీటి రోదనే.. మా వాళ్ల జాడ చెప్పండి.. లేదా శవాలనైనా ఇప్పించండి.. నాలు గు రోజులుగా కండ్లు కాయలు కాసేలా ఏడుస్తున్నాం.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అధికారుల కాళ్లపై పడి సిగాచి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఘటనలో 40 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఇంకా పది మంది ఆచూకీ లభించక పోవడంతో ఆ కుటుంబాల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే 18 మందిని గుర్తించి, వారి బంధువులకు అప్పగించారు. ఇంకా మృతుల మాంసపు ముద్దలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షలు ఆలస్యమవుతున్నందున బంధువుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఫ్యాక్టరీ వద్ద, ఆసుపత్రులకు తిరుగుతూ తమవారి ఆచూకీ తెలు స్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.
ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ప్రభుత్వం నియ మించిన అధ్యయన కమిటీ సభ్యులు వస్తున్నారని తెలుసుకొని గురువారం అధికారు లు బందోబస్తు నిర్వహించారు. మరోవై పు కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ నేతృత్వంలో శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఫ్యాక్టరీ వద్దకు వచ్చే పోలీస్ అధికారుల కాళ్లకు దండం పెడుతూ తమ వాళ్ల శవాలనైనా ఇప్పించండని బాధితులు బోరున విలపించారు.
ఈ ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది. మరోవైపు మృతిచెందిన మరో 20 మంది శవాలను గుర్తించడంలో డీఎన్‌ఏ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. అ ంతేగాకుండా మరో పదిమంది ఆచూకీ విష యం ఇంకా తేలలేదు. అసలు వారి మాం సం ముద్దలైనా దొరుకుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేలు డు దాటికి వారి శరీరాలు బూడిదగా మారి ఉంటాయని భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు వేగవంతం చేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కావడం లేదు. ఫ్యాక్టరీలో ఘాటైన రసాయనిక వాస న వెదజల్లుతుండటంతో రెస్క్యూ సిబ్బందికి శిథిలాల తొలగింపు ఇబ్బందిగా మారింది.
ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే..
పటాన్‌చెరు మండలం బండ్లగూడ గ్రా మానికి చెందిన జతిన్ ప్రమాదానికి రెండు రోజుల ముందే కంపెనీలో చేరాడు. ఉద్యోగంలో చేరానన్న సంతోషం నిలవకముందే పేలుడు ఘటనలో గల్లంతయ్యాడు. నాలుగు రోజులవుతున్నా అతడి ఆచూకీ లభించక కుటుంబీకులు పరిశ్రమ వద్దకు వచ్చి ఏడుస్తూ పోలీసుల కాలపై పడ్డారు. తండ్రి రామదాస్ దుఃఖం అందర్నీ కలిచివేసింది.
నా భర్త శవాన్ని ఇప్పించండి..
కంపెనీలో పనిచేస్తున్న తన భర్త చోటూలాల్ జాడ తెలియడం లేదని ఓ మహిళ ఆక్రందణలు మిన్నంటాయి. కనీసం శవాన్నయినా కడసారి చూసేందుకు ఇప్పించండం టూ గుండెలవిసేలా రోదించింది. డీఎన్‌ఏ పరీక్ష తర్వాతే అప్పగిస్తామని చెప్పడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. పెద్ద దిక్కును కోల్పోయామని, మమ్మల్ని ఆదుకొని నా భర్త శవాన్ని ఇప్పించాలని ఆ ఇల్లాలు అధికారులను వేడుకుంది.
డీఎన్‌ఏ రిపోర్ట్‌కు జాప్యమెందుకు?
తన భర్త కంపెనీ ప్రమాదంలో మరణించాడో.. లేక ఏమయ్యాడో తెలియడం లేదని.. డీఎన్‌ఏ పరీక్షల పేరుతో జాప్యం ఎందుకు చేస్తున్నారని బాధితుడు లాల్సోన్ భార్య విలపిస్తూ వేడుకుంది. డీఎన్‌ఏ పరీక్షల పేరుతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తమ వాళ్ల శవాలను కూడా చూసుకోలేని దుస్థితి ఏర్పడిందని వాపోయింది.
పది మంది డీఎన్‌ఏ ఫలితాలు
సిగాచి పేలుడులో మృతి చెందిన 40 మందిలో ఇప్పటికే 18 మంది ఉద్యోగులకు చెందిన శవాలను వారి బంధువులకు అప్పగించారు. అయితే గురువారం మరో పది మంది శవాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. దీంతో ఇప్పటి వరకు 28 మంది శవాల గుర్తింపు పూర్తయ్యింది. ఇంకా 12 మందికి డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. ఇలావుండగా ఆచూకీ లభించని పది మంది కార్మికుల శవాలను ఇంకా వెలికితీయలేదు. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.