04-07-2025 01:29:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 3 (విజ యక్రాంతి): తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా-ఈ కార్ రేసిం గ్ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గురువా రం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీమంత్రి, ఈ కేసు లో ఏ1గా ఉన్న కేటీఆర్ జూన్ 16న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణలో ఆయన పలు కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఈ రేసింగ్ కోసం నిధులు విడుదల చేశామని అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్టు సమాచారం. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్‌ఈవో కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేద ని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. కేటీఆరే స్వయంగా వాట్సప్ ద్వారా ఎఫ్‌ఈవో కంపెనీకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారని వెల్లడించారు.
హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్‌ఈవో కంపెనీకి నిధుల మళ్లింపు విషయంలో ఆర్థిక శాఖ అనుమతి, ఎన్నికల నియమావళి పాటించకపోవడం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్‌ను ప్రశ్నించారు. ‘ఎఫ్‌ఈవో కంపెనీకి నిధులు విడుదల చేయాలని కేటీఆర్ వాట్సప్ ద్వారా ఆదేశించారు. ఈ నిధుల మళ్లింపులో తన ప్రమే యం లేదు. బిజినెస్ రూల్స్ పాటించాలని, అలాగే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని కేటీఆర్‌కు సూచించా’ అని అరవింద్ కుమార్ పేర్కొన్నారు.
అన్నీ నేను చూసుకుంటానని కేటీఆర్ చెప్పడంతోనే ఎఫ్‌ఈవో కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేశానన్నా రు. రూ.45.71 కోట్ల మొత్తాన్ని ఐవోబీ ద్వారా పౌండ్ల రూపంలో చెల్లించినట్టు అరవింద్ తెలిపారు. ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన నిధుల విడుదలలో ఎన్నికల నియమావళి అమలు లో ఉన్నప్పటికీ ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకపోవటం, మంత్రివర్గం ఆమోదం పొందకపోవటం, ఆ తర్వాత మూడేళ్లపాటు రేసుల నిర్వహణకు రూ.600 కోట్ల మేర చెల్లించేందుకు ఒ ప్పందం కుదుర్చుకోవడాన్ని అంతర్గత విచారణలో ప్రభుత్వం తప్పుపట్టింది.
ఈ అంశాలపైనే ఏసీబీ అరవింద్ కుమార్‌ను ప్రధానంగా విచారించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. అలాగే, ఏ3గా ఉన్న బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా రెండుసార్లు ప్రశ్నించారు.
వారి వాంగ్మూలాలతో పాటు లభ్యమైన ఆధారాల ఆధారంగానే అరవింద్ కుమార్‌ను ప్రశ్నించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అరవింద్ కుమార్ వాంగ్మూలంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. తదుపరి ఏసీబీ అధికారులు ఎవరిని ప్రశ్నించబోతు న్నారనేది ఉత్కంఠగా మారింది.