26-07-2025 12:00:00 AM
సాలూర, బోధన్ లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
నిజామాబాద్, జూలై 25 :(విజయ క్రాంతి) : అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర, బోధన్ మండల కేంద్రాలలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి లు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
సాలూరలో టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ మండలానికి చెందిన 108 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. బోధన్ లో లయన్స్ ఆసుపత్రి మీటింగ్ హాల్‌లో బోధన్ మండలానికి చెందిన 665 కుటుంబాలకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2.50 లక్షల రేషన్ కార్డులు మాత్రమే అందించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే 6 లక్షల పైచిలుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకనూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు.
అయితే అర్హులైన వారికే కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. ముఖ్యంగా నీటి వసతి, బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 22 కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు. రైతులకు కూడా ప్రభుత్వం ఇతోధికంగా మేలు చేకూరుస్తోందని అన్నారు.
రైతులు సంప్రదాయంగా వస్తున్న వరి సాగుకు బదులుగా అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 11,852 కొత్త రేషన్ కార్డులతో పాటు 84,232 మంది కొత్త సభ్యుల పేర్లను రేషన్ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు.
రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. దీంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు.
ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించిన కలెక్టర్, అర్హులైన వారు ఇంకనూ మిగిలి ఉంటే ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు.
లీకేజీలు, ఫ్లోరింగ్ వంటి వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.