02-08-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ దండే విఠల్
కుమ్రం భీం ఆసిఫాబాద్/ చింతలమాలపల్లి,ఆగస్టు 1(విజయక్రాంతి): అర్హత కలిగిన అందరికీ రేషన్ కార్డులు అందుతాయని ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని కౌటాల, చింతల మానేపల్లి మండలలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ పథకాలు వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు అమలు చేస్తూ మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందిస్తామని, అర్హత కలిగి రేషన్ కార్డులలో పేరు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు ,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.