20-09-2025 12:00:00 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని కొమరం భీం హాల్లో తెలంగాణ హేతువాద సంఘం 5 వ ద్వైవార్షిక మహాసభలు,‘హేతువాద, మానవవాద అధ్యయన తరగతులు‘ నిర్వహించనున్నట్లు తెలంగాణ హేతువాద సంఘం ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే.నభీ సాహెబ్, పి.క్రాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ అధ్యయ న తరగతులలో ప్రముఖ సాహితీవేత్తలు, వక్తలు పాల్గొని హేతువాద తత్వం, దాని ప్రయోజనాలు, మానవవాదం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారని తెలిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా విలువలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. హేతువాదం పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ తరగతులకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.