calender_icon.png 14 August, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలను సందర్శించిన ఆర్డిఓ జయచంద్రారెడ్డి

14-08-2025 06:58:47 PM

తూప్రాన్ (విజయక్రాంతి): సామాజిక బాధ్యతతో కార్పొరేట్ కంపెనీలు చేసే దాతృత్వము సమాజంలో మార్పులకు కారణం ఔతుందని, దానికి సాక్ష్యమే టోల్ ప్లాజా వద్దనున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల అని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి(RDO Jaya Chandra Reddy) అన్నారు. ఆయన గురువారం ఇంటర్మీడియట్ వరకు ఉన్న పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేసి వంట పదార్థాల నాణ్యతను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, గతంలో రవాణా, బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ యాదృచ్ఛికంగా ఈ పాఠశాలను సందర్శించిన సందర్భంలో వారు సూచించిన విధంగా జిల్లా కలెక్టర్ యొక్క సహకారంతో వి ఎస్ టి ఐటిసి, స్థానికంగా ఉండే పరిశ్రమల సహాయంతో ఈ పాఠశాలకు కావలసిన కొన్ని మౌలిక వసతులను కల్పించడం వలన పాఠశాల పట్ల విద్యార్థుల యొక్క దృక్పథం మారి చదువులో క్రీడల్లో రాణించి, గత సంవత్సరం ఫలితాలలో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులను సాధించి, ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పులు కనిపిస్తున్నట్లుగా పాఠశాల సిబ్బంది ఆర్డిఓకు తెలియజేశారు. ఇటీవల కాలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అలాగే రగ్బీ జాతీయ పోటీలలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులను ఆర్డిఓ అభినందించారు.

ఈ సందర్భంగా వారు పిల్లలందరితో మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత సత్ప్రవర్తన మనకు సంతృప్తిని కలిగిస్తుందని, జీవితం మీద సానుకూల దృక్పథం పెరిగి, మనం మంచి పౌరులుగా తయారు కావడానికి దోహదపడుతుందని వారికి ఉద్బోధించారు. పిల్లల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఉద్యానవన వసతులను ఆయన పరిశీలించి, ఆర్డిఓ కార్యాలయం తరపున తాము సైతం చేయూత నిస్తామని అక్కడ చెట్ల చుట్టూ పిల్లల తల్లిదండ్రులు సేద తీరేవిధంగా కూర్చోవడానికి కట్టడాలు నిర్మిస్తామని ఆయన పాఠశాల యజమాన్యానికి హామీ ఇచ్చారు.