14-08-2025 07:19:24 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనున్న 79వ భారత స్వాతంత్ర దినోత్సవం(Independence Day) వేడుకల ఏర్పాట్లను ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో(In-charge Collector Lenin Vatsal Toppo) పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 79వ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని, అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వేడుకలకు హాజరయ్యే స్వాతంత్ర సమరయోధులకు, అతిధులు, ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సమకూర్చాలని, వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించి స్టాల్స్ ను సిద్ధం చేయాలని, సాంస్కృతిక ప్రదర్శనలన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా నాయక్, డి.ఈ.ఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి మరియన్న, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.