calender_icon.png 27 January, 2026 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 కోట్ల దోపిడీ కేసుపై దర్యాప్తునకు సిద్ధం

27-01-2026 01:14:28 AM

బాధితులు ఫిర్యాదు చేస్తే వాస్తవాలు వెలుగులోకి..

కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడి

ఇప్పటికే కేసుపై ఆరాతీస్తున్న మహారాష్ట్ర సిట్

దర్యాప్తు అధికారుల అదుపులో ఐదుగురు నిందితులు

బెంగళూరు, జనవరి 26: గోవా సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లను తరలిస్తున్న రెండు కంటైనర్లను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ గ్రేట్ రాబరీపై దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే  వాస్తవాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు.   గోవా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.400 కోట్ల నగదు తరలిస్తున్న రెండు ట్రక్ కంటైనర్లు కర్ణాటకలో గత అక్టోబర్‌లో అదృశ్యమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ సేఠ్ ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేసు దర్యాప్తునకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు చేయిస్తున్నారు. ఖానాపుర్ తాలూకాలో ప్రమాదకర అటవీ ప్రదేశమైన చోలార్‌ఘాట్ ఈ కంటైనర్లు అదృశ్యమైన కొద్దిరోజులకు మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీ ప్ పాటిల్‌ను నగదు యజమాని కిశోర్ సేఠ్ అనుచరులు బంధించారు. నగదు నువ్వే అపహరించావని ఆరోపించి, వెనక్కి ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామంటూ చిత్రహింసలు పెట్టారు. వారి చెరనుంచి తప్పించుకున్న సందీప్ పాటిల్ ఈ నెల 1వ తేదీన నాసిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూ.400 కోట్ల నగదు కంటైనర్లు మాయం కావడంతో తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు.

దీంతో నాసిక్ పోలీసులు గోవా, బెళగావి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిని.. విరాట్‌గాంధీ, జయేశ్ కదమ్, విశాల్ నాయుడు, సునీల్ దుమాల్, జనార్దన్ దైగుడేలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరిలో విరాట్‌గాంధీ రాజస్థాన్‌కు చెందిన హవాలా ఆపరేటర్. మరో ఇద్దరు నిందితులు  అజార్ బిల్డర్, కిశోర్ సావ్లా పరారీలో ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు ఈ సొమ్ము కాంగ్రెస్ పార్టీ తరలిస్తోందంటూ భాజపా ఆరోపించగా.. అవన్నీ తప్పుడు ఆరోపణలని కర్ణాటక మంత్రులు సతీష్ జార్కి హోలీ, ప్రియాంక్ ఖర్గే కొట్టి పారేశారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో గుర్తించాలని సవాల్ విసిరారు.