27-01-2026 01:16:39 AM
రాజస్థాన్‌లో 10,000 కిలోలు స్వాధీనం
నలుగురు నిందితుల అరెస్ట్
రిపబ్లిక్ డే వేళ ఉలిక్కిపడిన దేశం
జైపూర్, జనవరి 26 : రిపబ్లిక్ డే రోజున దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివవారం రాత్రి రాజస్థాన్ ఏటీఎస్, పోలీసులు కలిసి చేసిన సంయుక్త ఆపరేషన్‌లో భారీ పేలుడు పదార్థాలు పట్టుబడటం సంచలనం రేపింది. జైపూర్ దగ్గర ఉన్న అంబాబరి ప్రాంతంలోని ఒక గోదాంతోపాటు మరో ఆవరణలో దాచిన సుమారు 10 వేల కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. వీటిలో 187 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు డిటోనేటర్లు, డిటోనేటర్ వైర్లు, ఇతర పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. గణతంత్ర వేడుకలు , పరేడ్ల సమయంలో పెద్ద దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఒకరికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా రెండు రోజుల నిఘా అనంతరం ఆదివారం రాత్రి ఈ దాడి చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో దేశం ప్రమాదం నుంచి తప్పించుకుందని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ తెలిపారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పోలీస్ బృందాలను ప్రత్యేకంగా అభినందించారు. కేసు ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికాగా.. జైపూర్, ఉదయపూర్ వంటి నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఈ అలర్ట్ ప్రకటించారు.