05-12-2025 01:30:38 AM
సమన్వయం వర్సెస్ ప్రజామోదం
బీసీ నేత ఓసీల అణచివేత?
గరిడేపల్లి మండలంలో వెలుగులోకి ఘటన
నల్లగొండ, డిసెంబర్ 4 (విజయక్రాంతి): హుజూర్నగర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో అధికార పార్టీ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజామోదం ఉన్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు మండల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీలోని సభ్యులు గ్రామాలకు వెళ్లి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం ఈ కమిటీ యొక్క బాధ్యత.
అనుకున్నదొకటి.. అయింది ఇంకొకటి..
అయితే కొన్ని చోట్ల ఈ సమన్వయం కమిటీనే తప్పుదారి పడుతోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, పలువురు ఆశావాహులు బాహాటంగానే ఆరోపి స్తున్నారు. సమన్వయ కమిటీలలోని సభ్యులలోని కొందరు ఆయా గ్రామ పంచాయ తీల పరిధిలో ఉన్న కొందరితో ఉన్న సాన్నిహిత్యం, మరి కొందరితో ఉన్న వ్యక్తిగత బేధాభిప్రాయాలను అభ్యర్థుల ఎంపికపై రుద్దుతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రజామోదం, కార్యకర్తల అభిమానం ఉన్న నాయకులను పక్కకు పెట్టి వేరొకరికి అవకాశం ఇస్తూ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బహిర్గతమైన పంచాయితీ లొల్లి..
సమన్వయ కమిటీ సభ్యులు అనుసరిస్తున్న విధానాల గురించి కొంతకాలం గుబ్బనంగా ఉన్నప్పటికీ.. అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామాలలోకి వెళ్లిన నాటి నుంచి వారిపై సొంత పార్టీకి చెందిన వారి నుండే వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. మండలంలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రమైన గరిడేపల్లి, కుతుబ్ షాపురం వంటి స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుకు మెరుగైన అవకాశాలు ఉన్న అభ్యర్థులను కేవలం సమన్వయ కమిటీలోని కొందరు ఉన్నత వర్గాలకు చెందిన సభ్యులకు ఇష్టమైన వారిని మాత్రమే ఎంపిక చేయడంతో ప్రసార మాధ్యమాల ద్వారా బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
బీసీ నేతపైనే గురి..
గరిడేపల్లి మండల జడ్పిటిసిగా, ఆయన సతీమణి ఎంపీపీగా సేవలందించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పెండెం శ్రీనివాస్‌కు ఇటు పార్టీలో, వ్యక్తిగతంగా మండల వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, గరిడేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచేం దుకు ఆసక్తి చూపగా మంత్రి ఉత్తమ్ సైతం పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలోనే నిలబడాలని తన అభిప్రాయం చెప్పినట్లు కొంద రు బాహాటంగానే చెబుతుండటం గమనించదగ్గ విషయం.
అయితే ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో గరిడేపల్లిలోని ఇద్దరు ఉన్నత వర్గాలకు చెందిన నాయకులు రాజకీయంగా ఎదుర్కోవడం కష్టమని ఒక పథకం ప్రకారం సమ న్వయ కమిటీ అభిప్రాయం అంటూ ఆయనను అభ్యర్థిగా ప్రకటించకుండా తమకు అనుచరుడైన వేరొకరికి కేటాయించారంటూ స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అభ్యర్థి కేటాయింపుకు ముందు గరిడేపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని మెజారిటీ సభ్యులు మద్దతు ప్రకటించినప్పటికీ, అవేమి పట్టించుకోకుండా వారికి ఇష్టమైన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారంటూ కొం దరు బహిర్గతంగానే చెబుతున్నట్లు సమాచారం.
బహిర్గతమైన విభేదాలు..
తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి మద్దతు ఉన్నప్పటికీ కావాలనే ఇద్దరు ఉన్నత వర్గానికి చెందిన మండల నాయకులు మిగిలిన సమన్వయ కమిటీ సభ్యులను రాత్రికి రాత్రే ఏ మార్చి నా రాజకీయ ఎదుగుదలను తొక్క వేయాలని చూస్తున్నారనే ఆరోపణలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. దీంతో అధికార పార్టీలో విభేదాలు బహిర్గతమైనట్లయింది.
రెబల్‌తో తప్పని గుబులు..
కాంగ్రెస్ పార్టీకి చెంది సీటును ఆశించి భంగపడ్డ ఆశావాహులు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం లేకపోలేదనీ విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల నామినేషన్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలలో కొందరు స్వార్ధ పూరితంగా తీసుకున్న నిర్ణయాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభావం తప్పదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, కొంద రు కాంగ్రెస్ కార్యకర్తల నుండి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది.
నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున మంత్రి ఉత్తమ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేచి చూస్తున్నట్లు సమాచారం.