05-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అతడికి బెయిల్ వస్తుందా.. లేక పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకుంటారా.. అనే విషయంపై గురువారం నాం పల్లి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. రవి దాఖ లు చేసిన బెయిల్ పిటిషన్లు, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఇరువర్గాల వాదన లు విన్న న్యాయమూర్తి.. తీర్పును శుక్రవారానికి వాయి దా వేశారు. పోలీసుల కస్టడీ పిటిషన్లపై రవి తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక కేసులో రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఇప్పుడు మళ్లీ అదే రకమైన మరో కేసులో కస్టడీ కోరడం సమంజసం కాదు. కేవలం నిందితుడికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నా రని డిఫెన్స్ లాయర్లు కోర్టు దృష్టి కి తెచ్చారు.
మరోవైపు పోలీసులు తమ వాదన వినిపి స్తూ.. రవి నుంచి ఇంకా కీలక సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. ముఖ్యంగా నాగచైతన్య నటిస్తున్న తండేల్, ధనుష్, నాగార్జునల మల్టీస్టారర్ కుబే ర సినిమాల పైరసీ లింకులపై విచారించాల్సి ఉందని కోర్టు కు తెలిపారు.
ఈ సినిమాలకు సంబంధించిన డేటా లీకేజీ, పైరసీ నెట్‌వర్క్‌పై కూపీ లాగాలంటే కస్టడీ తప్పనిసరి అని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. అటు కస్టడీ పిటిషన్, ఇటు బెయిల్ పిటిషన్ రెండింటిపైనా తీర్పును నేటికి వాయిదా వేసింది. దీంతో రవి జైలులోనే ఉంటాడా? లేక బయటకు వస్తాడా.. అన్నది తేలనుంది.