05-12-2025 12:54:48 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో/సంగారెడ్డి/మేడ్చల్ అర్బన్/రాజేంద్రనగర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: కాంగ్రెస్ సర్కార్ దండుపాళ్యం ముఠాగా మారిందని, హెచ్‌ఐఎల్టీపీ (హిల్ట్) పేరుతో రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాంత భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు పారిశ్రామి వాడలను మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సందర్శించి, ఆందోళనలు వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేసే కుట్ర లో భాగంగా హిల్ట్ పాలసీని తెచ్చిందని ఆరోపించారు. పాతబస్తీలోని చందులాల్ బరదరిలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పర్యటించి, ఆందోళన చేపట్టారు.
హిల్ట్ పాలసీ ఓ కుంభకోణం: మాజీ మంత్రి గంగుల
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్‌రావు ఆందోళన చేపట్టారు. తెలంగాణను దోచుకుంటున్న దండుపాళ్యం ముఠా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ హిల్ట్ పాలసీ రద్దు చేయాలని నినాదాలు చేశారు.
పటాన్‌చెరు ప్రాంతంలో 1,188 ఎకరాలు, పాశమై లారం పారిశ్రామికవాడలో 1,495 ఎకరాలు కలిపి మొత్తం 2,708 ఎకరాల పారిశ్రామిక భూములను హిల్ట్ పేరిట ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ దేశ చరిత్రలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం అని ఆరోపించారు. వారివెంట డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, బెవరేజెస్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, ఎస్టీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్‌రెడ్డి ఉన్నారు.
భూ మాఫియాకు రెడ్ కార్పెట్: తలసాని శ్రీనివాస్‌యాదవ్
నగరంలోని విలువైన పారిశ్రామిక భూములను హిల్ట్ పాలసీ పేరుతో చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తూ, భూ మాఫియాకు తెరలేపారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణలు చేశారు. సనత్ నగర్‌లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి తలసాని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో 87.31 ఎకరాల భూమి ఉందని తలసాని తెలిపారు.
ఇక్కడ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం రూ. 21 కోట్లు ఉంది. ఓపెన్ మార్కెట్ విలువ రూ. 43 నుంచి 45 కోట్లు పలుకుతోంది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దీనిని ఎకరం కేవలం రూ. 6.31 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు.
హైదరాబాద్ పరిధిలోని 21 ప్రాంతాల్లో మొత్తం 9,292 ఎకరాల పారిశ్రామిక భూమి ఉందని, దీన్నంతటినీ కొత్త పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 5 లక్షల కోట్ల అవినీతి జరగబోతోందని మండిపడ్డారు. తరలించిన పరిశ్రమల భూముల్లో కనీసం 50 శాతం భూమినైనా ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల పొట్ట కొడుతున్న సీఎం: మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ పారిశ్రామిక వాడలో హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక వాడల్లో హిల్ట్ పాలసీని నెలకొల్పి కార్మికుల పొట్ట కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి రాబోయే రోజుల్లో చుక్కెదురు అవుతుందని జోష్యం పలికారు.
అత్యంత ఖరీదైన పారిశ్రామిక వాడల్లోని భూములను అన్యాక్రాంతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్‌ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ పట్టణ పార్టీ అధ్యక్షుడు బి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కోల్పోనున్న కార్మికులు: -మాజీ మంత్రి సబితారెడ్డి
హిల్ట్ చట్టంతో వేలాదిమం ది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశముందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో మాజీ శాసన మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డిలతో కలిసి ఆమె పర్యటించారు.
హిల్ట్ చట్టం తో వేలాదిమంది కార్మికులు ఉపా ధి కోల్పోయే ప్రమాదముందని, ఈ చేస్తున్న కుట్రలను ఎండగట్టాల్సిన అవసరముందని కార్మికుల కు వివరించారు. హిల్ట్ చట్టంతో విలువైన భూముల రిజిస్ట్రేషన్ ఫీజును 30 శాతం చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామనడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.