09-02-2025 10:40:44 PM
సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో..
గాంధీ విగ్రహానికి వినతి పత్రం..
పటాన్‌చెరు: ముంబాయి హైవే నుంచి చందానగర్ మీదుగా బంధంకొమ్ము నుంచి అమీన్‌పూర్ వెళ్లే ప్రధాన రహదారి పనులను వెంటనే పున:ప‌్రారంభించాలని సీపీఎం ఆదివారం రాస్తారోకో నిర్వహించి, గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసింది. అమీన్‌పూర్ మున్సిపల్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, వందల కాలనీలలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు అధికంగా ప్రయాణించే ప్రధాన రోడ్డును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గుంతలు తేలిన రోడ్డుతో అందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు లలిత, జార్జ్, వీరస్వామి, అనంతరావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.