08-09-2025 01:24:00 PM
పటాన్చెరు (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో నందారం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా లడ్డు వేలం ఘనంగా జరిగింది. ఈ పోటీపోటీ వేలంలో రికార్డు స్థాయిలో రూ.25,01,116కు లడ్డును సంసిద్ధి గ్రూప్ సీఈఓ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ కైవసం చేసుకున్నారు. లడ్డును అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, గూడెం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఒగ్గు సాయికిరణ్ స్వీకరించారు. ఈ సందర్భంగా నరసింహా గౌడ్ మాట్లాడుతూ, “36 ఏళ్లుగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈసారి లడ్డు రికార్డు స్థాయిలో అమ్ముడవడం గణనాథుడి కరుణ” అని అన్నారు.
లడ్డు కైవసం చేసుకున్న ఒగ్గు సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, “మూడేళ్లుగా లడ్డు కొనే ఆరాటం నెరవేరింది. ఈసారి ఎలాగైనా లడ్డు దక్కించుకోవాలని సంకల్పంతో వచ్చి, రికార్డు స్థాయిలో లడ్డు సాధించడం సంతోషంగా ఉంది” అని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నందారం యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని వైభవంగా మార్చారు.