calender_icon.png 29 August, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ కాలనీ వాసులకు ఊరట

29-08-2025 03:15:21 AM

వరద ముప్పు తప్పించిన హైడ్రా కమిషనర్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 28 (విజయ క్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన ఓయూ కాలనీకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు ఒక వరంలా నిలిచారు. వరద ముం పును నివారించడానికి చేపట్టిన కాలువల అనుసంధాన పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ పనుల వల్ల తమకు వరద ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

నాలా అనుసంధానంతో వరదలకు చెక్

ఓయూ కాలనీలోని ఆదిత్యా నగర్, రాహుల్ నగర్, బృందావన్, సూర్య నగర్ కాలనీల గుండా వెళ్లే వరద కాలువను మణికొండ మున్సిపాలిటీలోని ఆంబియెన్స్ కోర్ట్యార్డ్ గేటెడ్ కమ్యూనిటీ ముందు నుంచి వెళ్లే లైన్కు అనుసంధానం చేశారు. ఈ ప్రత్యేక పైపులైన్ నిర్మాణాన్ని కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. షేక్పేట కొత్త చెరువు నుంచి ఆదిత్య నగర్ మీదుగా శాతం చెరువును అనుసంధానించే వరద కాలువలోని అక్రమ ఆక్రమణలను కూడా ఆయన పరిశీలించారు. వరద ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని, అవసరమైన చోట్ల నాలా వాస్తవ వెడల్పును పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.

స్థానికుల కృతజ్ఞతలు

వరద ముప్పు నుంచి తమను రక్షించినందుకుగాను షేక్పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్.. కమిషనర్ రంగనాథ్ను శాలువాతో సత్కరించారు. అలాగే, స్థానికులు పూలగుచ్ఛాలు ఇచ్చి తమ కృతజ్ఞతలను తెలిపారు. కమిషనర్ చొరవ వల్లే ఈ అనుసంధానం సాధ్యమైందని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని వారు తెలిపారు.

ఆక్రమణలపై హైడ్రా సీరియస్

ఇదే పర్యటనలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 19లో నాలా ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదును కూడా కమిషనర్ పరిశీలించారు. అక్కడ నాలాను ఆక్రమించడమే కాకుండా, సెల్లార్ కోసం తవ్విన గుంతను పూర్తి చేయకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలా ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే, ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.