29-08-2025 03:17:52 AM
ఖైరతాబాద్ బడా గణేశ్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 28 (విజయ క్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ఐపీఎస్ బుధవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేశ్ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ విగ్ర హం ప్రతిష్ఠించిన రెండవ రోజునే ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోవడం తమ ఆన వాయితీగా వస్తోందని ఆయన తెలిపారు.
25 ఏళ్ల గణేశ్ ఉత్సవాల బందోబస్తు అనుభవం...
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 25 సంవత్సరాలుగా ప్రజలతో పరిచయం ఉందని, డీసీపీ సెంట్రల్ జోన్గా, అడిషినల్ సీపీ ట్రాఫిక్గా, ప్రస్తుతం పోలీస్ కమిషనర్గా ఇప్పటివరకు 11 సార్లు గణేశ్ నిమజ్జన బందోబస్తులను పర్యవేక్షించానని తెలిపారు.
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు..
వచ్చే సెప్టెంబర్ 6న జరగనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. ఉత్సవాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడా ది సుమారు 11,000 దరఖాస్తులలో 10,900 గణేష్ మండపాలకు ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇచ్చామని, నగరంలో ఉన్న మిగిలిన 15,000 విగ్రహాలను కూడా రికార్డుల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా మని చెప్పారు.
30 వేల మంది పోలీసుల పహారా...
ఈ ఉత్సవాల కోసం హైదరాబాద్ పోలీస్ విభాగాల నుండి 19,000 మంది పోలీసులు అందుబాటులో ఉంటారని, అదనంగా బయటి జిల్లాల నుండి 8,500 మం ది పోలీసులు, 42 ప్లాటూన్లు, 10 సీఏపీఎఫ్ కంపెనీలు, మరియు ఆక్టోపస్ బృందాలు వస్తున్నాయని, మొత్తం 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు. నిమజ్జన ఊరేగింపులను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్లతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
విద్యుత్ జాగ్రత్తలు తప్పనిసరి...
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, మండ ప నిర్వాహకులు విద్యుత్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పటికీ, సరైన పద్ధతిలో కనెక్షన్ తీసుకోవాలని, వర్షానికి తడిసిన కట్టెలు కూడా విద్యుత్తు వాహకాలుగా మారే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే, ప్రతి మండపం వద్ద వాలంటీర్లను నియమించుకోవాలని, రాత్రిపూట కనీసం 2-3 వలంటీర్లు విధిగా ఉండాలని చెప్పారు.