01-07-2025 02:36:27 AM
-బోర్లు వేసిన వ్యక్తిపై హైడ్రా కేసు
శేరిలింగంపల్లి, జూన్ 30: మాదాపూర్‌లోని సున్నం చెరువులో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. సోమవారం ఉదయం హైడ్రా అధికారులు మాదాపూర్ సున్నం చెరువు వద్దకు వెళ్లి, పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న గుడిసెలను కూడా తొలగించారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మో టార్లను కూడా తొలగించారు. మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది.
ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగిం చవద్దని హైడ్రా అధికారులు సూచించారు. సున్నం చెరువులో ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయి అని తన పరిశోధ నలలో తేల్చిన హైడ్రా ఈ నీటిని తాగవద్దని సూచించింది. అయితే ఈ చెరువు పక్కన మూడు బోర్లు వేసిన వ్యక్తి ఈ నీళ్లను ట్యాంకర్ల ద్వారా మాదాపూర్‌లోని ఐటీ కంపెనీలకు, ప్రైవేట్ హాస్టళ్ల కు, విద్యాసంస్థలకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు.
ఆ వ్యక్తిపైన హైడ్రా కేసు నమోదు చేసింది. చెరువు పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను కూడా హైడ్రా అధికారులు సీజ్ చేశారు.