calender_icon.png 2 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ యేడూ పాత ఫీజులే!

01-07-2025 02:34:11 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): పలు కోర్సుల ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యాసంవత్సరానికి ప్రొఫెషనల్ కోర్సులకు పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022-25 బ్లాక్ పీరియడ్‌కు ఖరారు చేసిన ఫీజులనే ఈ ఏడాది అమలు చేయనున్నట్లు ఉత్త ర్వుల్లో ఆమె పేర్కొన్నారు.

ఈ ఫీజులు బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీ.ఆ ర్క్, ఎంఆర్క్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్.డీ, ఫార్మ్ డీ (పీబీ), ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్, బీ.వొకేషనల్ కోర్సులకు వర్తిస్తాయని ప్ర భుత్వం తెలిపింది. ఈ విద్యాసంవత్సరంతో 2022-25 బ్లాక్ పీరియడ్‌లో ఖరారు చేసిన ఫీజుల గడువు ముగియడంతో ఇటీవల టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

అయితే ఇంజినీరింగ్‌లో ఫీజులు భారీగా పెరుగుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు ఖరారు చేసేముందు మరోసారి అధ్యయనం చేయాలని అధికారులను ఇటీవలే ఆదేశించారు. దీనిపై ఒక కమిటీని నియమించి అధ్యయనం చేయనున్నారు. అయితే తాజాగా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఫీజుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ విద్యాసంవత్సరం పాత ఫీజులనే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.