21-09-2025 12:49:21 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా ఆస్పత్రిలోకి మీడియాకు అనుమతిపై ఆసుపత్రి సూపరిండెంట్ ఆంక్షలు విధిస్తూ ఆసుపత్రి గోడలపై వేసిన పోస్టర్లను శనివారం సాయంత్రం తొలగించారు. గత నాలుగు రోజుల క్రితం మీడియాపై ఆంక్షలు విధిస్తూ జిల్లా ఆసుపత్రి గోడలపై పోస్టర్లు వేయగా జర్నలిస్టు సంఘాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి జర్నలిస్ట్ సంఘాలు నిర్ణయించాయి. దీంతో దిగొచ్చిన ఆసుపత్రి సిబ్బంది గోడలపై అంటించిన పోస్టర్లను తొలగించారు. ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు విధించడం సరైనది కాదని జర్నలిస్టు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్న వేళ వారి నిరసనకు ఫలితం వచ్చినట్లయ్యింది.
ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలోకి మీడియాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో గత వారంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆసుపత్రి గోడకు పోస్టర్లు అంటించడం జరిగిందని వాటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఆసుపత్రిలో సేవలు మెరుగయ్యాయని, అయితే ఇతర ఆస్పత్రులతో పోలిస్తే కొంత మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
అయినప్పటికీ జిల్లా ఆస్పత్రిలో ప్రతిరోజు 700 పైగా ఓపి కొనసాగుతుందన్నారు. ఉన్న సిబ్బందికి పని ఒత్తిడి ఎక్కువ కావడంతో మీడియా వారికి సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నామని, ఇప్పటినుండి అలా కాకుండా ప్రత్యేకంగా ఒక అధికారిని సమాచారం ఇవ్వడానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. మీడియా వారికి కావలసిన సమాచారం సదరు అధికారి దగ్గర నుండి తీసుకోవచ్చని వివరించారు. జిల్లా ఆస్పత్రికి మరింతమంది రోగులు వచ్చే విధంగా మీడియా సహకరించాలని కోరారు.