calender_icon.png 21 September, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్!

21-09-2025 12:48:04 AM

-ప్రియురాలు, భార్యతో కలిసి నిందితుడి ఆగడాలు

-కర్నూల్ ప్రాంత వాసికి బెదిరింపులు

-రూ.3.8 కోట్ల వసూలు

కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 20: సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన ఒక ముఠా గుట్టును కర్నూల్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. సొంత భార్యతో పాటు ప్రియురాలితో కలిసి ఒక వ్యక్తి న్యూడ్ వీడియోలతో ప్రజలను బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లు గడించిన ఉదంతం బయట పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన మల్లేష్, అతడి భార్య మేరీ, ప్రియురాలు మల్లిక సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఒక పక్కా ప్రణాళిక వేశారు.

ఇందుకోసం సోషల్ మీడియా (ఎక్స్)ను వేదికగా ఎంచుకున్నారు. ఎక్‌సలో “సంయుక్త రెడ్డి” అనే పేరుతో ఒక నకిలీ ఖాతాను సృష్టించారు. విలువైన వ్యవసాయ భూములను అతి తక్కువ ధరకే అమ్ముతున్నామని ఆ ఖాతా ద్వారా ప్రచారం చేస్తూ, డబ్బు అవసరం ఉన్నవారిని ఆకర్షించారు. వారి మాయమాటలు నమ్మి సంప్రదించిన వారిని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాలంటూ రెచ్చగొట్టారు. బాధితులు వీడియో కాల్స్‌లోకి రాగానే, వాటిని రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్ పర్వాన్ని మొదలుపెట్టారు.

ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి, బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ఈ విధంగా సుమారు రూ.3.8 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కర్నూలు పట్టణానికి చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన కర్నూలు పోలీసులు, సాంకేతిక ఆధారాలతో ఈ ముఠాను నాలుగు రోజుల క్రితం కల్వకుర్తిలో పట్టుకున్నట్లు తెలిసింది. ఈ ముఠా చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతజోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులను ఆరా తీయగా విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.