calender_icon.png 16 August, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రేశం రోడ్డుకు మరమ్మతులు

16-08-2025 12:00:00 AM

రూ.30 లక్షల సొంత నిధులు కేటాయించిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు, ఆగస్టు 15 :  పటాన్ చెరు ఓఆర్‌ఆర్ జంక్షన్ నుంచి ఇంద్రేశం మీదుగా పెద్దకం జర్ల చౌరస్తా వరకు రహదారిపై ఏర్పడిన భారీ గుంతలతో ప్రయాణీకులు, వాహనదారులు పడుతున్న నరకయాతనపై విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 11న  హడలెత్తిస్తున్న ఇంద్రేశం రోడ్డు అనే  శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు.

ఏర్పడిన గుంతలను పూడ్చి రాకపోకలకు రోడ్డు బాగు చేసేందుకు ఎమ్మెల్యే రూ.30లక్షల సొంత డబ్బును వెచ్చించారు. గత రెండు నెలల క్రితం రోడ్డు దుస్థితిపై విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎమ్మెల్యే రూ.20లక్షల సొంత డబ్బుతో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చినప్పటికి భారీగా కురిసిన వర్షాలకు మళ్లీ యధాస్థితికి చేరుకుంది. పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, శివనగర్, ఐనోలు, పోచారం, బచ్చుగూడెం, రామేశ్వరంబండ, కొడకంచి తదితర గ్రామాల ప్రజలు తరుచూ ఈ రోడ్డు మీదు రాకపోకలు సాగిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు.

పత్రికలో వచ్చిన కథనాలతో స్పందించిన ఎమ్మెల్యే ఇంద్రేశం రోడ్డు మరమత్తు పనులను శుక్రవారం ఆర్‌అండ్బీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రేశం, బచ్చుగూడ,  పోచారం, రామేశ్వరంబండ,  పెద్దకంజర్ల, ఐనోలు, చిన్న కంజర్ల  గ్రామాల పరిధిలో గృహనిర్మాణ రంగం వేగం పుంజుకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగిందన్నారు.   

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.30 లక్షల సొంత నిధులతో ఇంద్రేశం నుండి ఐనోలు మీదుగా బేగంపేట వరకు రహదారి మరమ్మతుల పనులు ప్రారంభిం చినట్లు తెలిపారు. పూర్తి స్థాయి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 80 లక్షలు మంజూరు చేసిందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్ బీ డీఈ రవీందర్, ఏఈ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, బండి శంకర్, ట్రాఫిక్ ఎస్‌ఐ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.