25-07-2025 02:01:19 AM
సూర్యాపేట, జూలై 24 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8గంటల పని స్థానంలో 10గంటలు పని చేయాలని తీసుకొచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేసి 8గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ షాప్ వర్కర్స్, బట్టలషాపు గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ఏఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు వెంపటి గురూజీ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో సైంటిఫిక్ గా, ఆరోగ్య రీత్య 8గంటల పని విధానం ఐఎల్‌ఓ తీర్మాణం మేరకు అమల్లో ఉందన్నారు. ఇప్పటికే కార్మికులు శ్రమ దోపిడికి గురవుతూ కనీస వేతనాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ అండ్ ఎస్టాబ్లిష్ యాక్ట్ సంబంధించి 73 సంస్థల్లో పని చేసే కార్మికులకు జీఓ 282తో నష్టం జరుగుతుందన్నారు.
పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనం రూ 24వేలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం బీఆర్టియు ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్లాత్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కందుల. వెంకన్న, ప్రధాన కార్యదర్శి కొండూరు వెంకన్న, నాయకులు జమాల్, మహమూద్, శివ, మహేష్, చక్రీ, వి.మంజుల, ఎం.డి. రేష్మాబేగం పాల్గొన్నారు.