25-07-2025 02:05:46 AM
తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ
ఖైరతాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ర్టంలో కల్లు గీత సొసైటీలకు 25 శాతం వైన్స్ లను 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, రాష్ర్ట కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వర్కింగ్ చైర్మ న్ ెులికట్టె విజయ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ లు మీడియాతో మాట్లాడారు.
త్వరలోనే వైన్స్ లకు టెండర్లు ఆహ్వానిస్తారని తెలుస్తుందని, ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గౌడ్లకు వైన్స్, బార్లలో 25శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలల పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నూతన పాలసీ కి నోటిఫికేషన్ ఇవ్వకముందే రిజర్వేషన్ సంబంధించిన గేజిట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ర్ట అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, బీసీ సమైక్య అధ్యక్షులు ఎస్ . దుర్గయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ర్ట అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, బత్తిని కీర్తి లత గౌడ్, కొత్త నవీన్ గౌడ్, గోదా వెంకటేష్ ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.