09-01-2025 12:00:00 AM
విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ప్రభుత్వం బాధ్యత, రాజ్యాంగపరంగానే అవి పొందడం పౌరుల హక్కు, కాని నేడు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. పౌరులందరికీ పని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి ఖండాతర వలసలు కొనసాగడానికి ప్రధాన కారణం ఉన్నచోట ఉపాధి లేకపోవడమే. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు నిధుల సమస్య ఉండొచ్చు.
కాని వీలైన మేర కుటీర పరిశ్రమలు పెట్టడం ద్వారా ఉపాధి కల్పించి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్వయం ఉపాధి పథకాలను పకడ్బందీగా, పారదర్శకంగా చేపడితే ఉపాధికి బోలెడు అవకాశాలున్నాయి. అదే సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి దిశగా అమలు చేస్తున్న పథకాలన్నీ సత్ఫలితాలిచ్చే విధంగా పర్యవేక్షణ పెంచాలి.
పుష్కలంగా సహజవనరులు
రాష్ట్రంలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి. విస్తారంగా అడవులు, నల్లరేగడి నేలలు. సింగరేణి బొగ్గు గనులు, ఖనిజ సంపద ఉంది. వీటి ఆధారంగానూ ఉపా ధి అవకాశాలు మెండుగా కల్పించొచ్చు. ప్రయివేటు రంగంలోనూ ఉపాధికి ఉన్న అవకాశాలను అన్వేషించాలి. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయాధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలు పెట్టొచ్చు. కరీంనగర్ జి ల్లాను ఐటి హబ్ గా మార్చి సాప్ట్‌వేర్ పరిశ్రమలు పెట్టడానికి వీలుంది.
కంప్యూటర్ విడి భాగాల తయారీ, హార్డ్‌వేర్ పనుల ద్వారానూ ఉపాధి పెంచడానికి వీలుంది. పెండింగ్‌లో ఉన్న నేదునూరు గ్యాస్ ఆ ధారిత పరిశ్రమ నెలకొల్పితే ప్రత్యక్షంగా, పరో క్షంగా సుమారు ఐదు వేల మందికి ఉపా ధి దొరుకుతుంది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపిస్తే మరో 4 వేల మంది కి పని దొరుకుతుంది. రామగుండం బిథ ర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమైతే రెం డు నుండి మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుంది.
సింగరేణిలో ఓపెన్ కా స్ట్ (ఓసీ)ల స్థానంలో అండర్ గ్రౌండ్ మై న్స్ (యూజీ) రావాలి. ఒక భూగర్భ గని లో వెయ్యి మంది అవసరం పడితే ఓసీ లో 300 మంది కార్మికులకు మించ రు. కావు న కొత్త ప్రభుత్వం ఓసీలకు ఇక అనుమతించకపోవడం మంచిది. కరీంనగర్ జిల్లా మంథని నుండి వరంగల్ జిల్లా భూపాలపల్లి బేస్ వరకు కొత్తగా 8 అంతర్గత బొగ్గు బావుల ఏర్పాటుకు అవకాశాలున్నాయి.
రైలు, విమాన సర్వీసులు పెరగాలి
ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రధానంగా రవాణా మార్గాలు అవసరం. రోడ్డు రవాణా పెద్దగా పెట్టుబడులను ఆకర్షించదు. రైల్వే, విమానయా నం తప్పనిసరి, ఆదిలాబాద్, వరంగల్‌లోని ప్రతిపాదిత విమానకేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. కరీంనగర్లో మరొకటి స్థాపించాలి. కరీంనగర్ - మనోహరాబాద్, కొత్తపల్లి - హైదరాబాద్, జగిత్యాల మీదుగా పెద్దపల్లి - నిజామాబాద్, ఆదిలాబాద్ మీదుగా వయా ఆర్మూర్, నిజామాబాద్, బోధన్,-బీదర్ తదితర రైల్వే లైన్ల పూర్తికి తెలంగాణ ఎంపిలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ఉపాధి హామీ చట్టాన్ని అవసరమైతే పట్టణాలకూ వర్తింపజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో పసుపు పరిశోధనా కేంద్రానికి అనుసంధానంగా పసుపు బోర్డు , శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు మద్దతు ధరలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగం లో వాణిజ్య పంటలకంటే ఆహార పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు తగ్గకుండా చూడాలి.
ఉపాధి శిక్షణా సంస్థలు
తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధిపై శిక్ష ణ ఇచ్చి, వారికి ఉపాధి అవకాశాలు చూప డం దీని బాధ్యత. ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. దీనికింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు ఉచితశిక్షణ, వసతితోపాటు క్లాసులకు హాజరైనందుకు గాను రోజుకు రూ.200 చొప్పున సదరు సంస్థే చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ పథకం అమలు ఎలా ఉంది. దాని ఫలితాలెలా ఉన్నాయనే దానిపై కొత్త ప్రభుత్వం దృష్టిసారించాలి.
గ్రామీణ స్వయం ఉపాధి , శిక్షణా సంస్థ- ఆర్సెట్ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ )అనే మరో రాష్ట్ర ప్రభుత్వ పథకం ఉంది. రాష్ట్ర గ్రామీణ మంత్రిత్వశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. దీని నిర్వహణ, శిక్షణ కల్పించే బాధ్యతలు లీడ్ బ్యాంక్ కు అనుసంధానంగా ఉన్న రాష్ట్ర బ్యాంకులకు అప్పగించారు. తెలంగాణలోని మెదక్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఎస్బీహెచ్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
శిక్షణ తర్వాత స్వయం ఉపాధి కోసం అవసరమయ్యే లోన్లు, బ్యాంకు లింకేజీ సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా అనుసం ధానించినట్లు సమాచారం. ఇందులో చేరి న విద్యార్థులకు శిక్షణ, ఉపాధి, వసతి అన్నీ ఉచితమే. శిక్షణ అనంతరం కూడా మూడే ళ్ల పాటు సదరు వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఉపాధి పొందుతున్నాడా? ఖాళీగా ఉన్నా డా..? అన్న విషయాలను పర్యవేక్షించే బా ధ్యత శిక్షణ ఇచ్చిన సంస్థదే. దీని అమలు ఎలా ఉంది, ఆ దిశగా వస్తున్న ఫలితాలపై కొత్త ప్రభుత్వం పరిశీలించాలి.
గ్రామీణ ఐకెపిలో నిరుద్యోగులను క్షేత్రస్థాయిలో గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడం ఉద్దేశంగా దీనిని చేపట్టారు. 18 ఏళ్లు పైబడ్డ ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా ఉండరాదనే ది దీని ఉద్దేశం. దీని కోసం అంతకు ముం దు కూడా రూ.వేల కోట్లు వెచ్చించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఉపాధి పొందింది ఎంతమంది? ఫలితాలు ఎలా ఉన్నాయో కొత్త ప్రభుత్వం దృష్టిసారిస్తే మంచిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సదుద్దేశంతో, లక్ష్యం కోసం పెట్టిన ఇలాంటి పథకాలు అనేకం ప్రజలకు అవగాహన లేకుండా ఉన్నాయి. వీటి విధివిధానాలు పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
కార్పొరేట్ సామాజిక బాధ్యత
ప్రతి కార్పొరేట్ సంస్థ, పరిశ్రమ యాజమాన్యం సామాజిక బాధ్యత కింద వారి లాభాల్లో 2 శాతం సేవా రంగాలకు వెచ్చించాల్సి ఉంటుంది. పేదరిక నిర్మూలన, దారిద్య్ర నిర్మూలన దిశగా వాటిని వెచ్చించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆ నిధులను ఆయా సంస్థలు ఖర్చుచేస్తున్న తీరును ఓ సారి ప్రభుత్వం పరిశీలించాలి. అవసరమైతే సదరు సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీ సంయుక్తంగా వీటిని ఖర్చు చేసే మార్గాన్ని ఆలోచించాలి. దీనిద్వారా కూడా ఉపాధిని సృష్టించే వీలుంది.
ఉపాధి హామీ పథకం(ఈజిఎస్) కింద ప్రతి పంచాయతీ పరిధిలో నర్సరీల పెంపునకు అవకాశమివ్వొచ్చు. తద్వారా రాష్ట్ర ప్ర భుత్వం కొంతమందికి స్థిరమైన ఉపాధి కల్పించొచ్చు. కొన్ని ప్రభుత్వ పథకాల పనులను ప్రభుత్వ రంగ శిక్షణా సంస్థల్లో పనిచేసిన వారికే ఎటాచ్ చేయాలి. ఉదాహరణకు ఇందిరా ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మించడానికి రాష్ట్రప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వం ద్వారా శిక్షణ పొందిన వ్యక్తులకే వీటిని కేటాయించాలి.
ఉట్నూరు ఐటీడీఏని పునరుద్ధరించాలి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను కొత్త ప్రభుత్వం పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలిస్తే అక్కడి గిరిజనులకు ఉపాధి దొరుకు తుంది. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ఉత్తర తెంగాణపై గత పాలకులు శ్రద్ధ చూ పించలేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అపవాదు రాకుం డా చూసుకోవడం అవసరం. కొద్దిపాటి శ్రద్ధ, ప్రణాళికాబద్ధ కృషితో ఇప్పటికిప్పుడే కొత్తగా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయినా ఉన్న వనరులతోనే ఉన్న చోట నే వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు బోలెడు అవకాశాలున్నాయి.ఈ దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తుందన్న కొండంత ఆశతో ఇక్కడి ప్రజలు, నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంది.
వ్యాసకర్త సెల్ : 85010 61659