07-10-2025 01:39:42 AM
-బతుకమ్మకుంటను చూస్తే ముచ్చటేస్తోంది
-సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయం
-జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి
-హైడ్రాపై హైకోర్టు ప్రశంసలు
హైదరాబాద్ సిటీ బ్యూరో,అక్టోబర్ 6 (విజయక్రాంతి ): నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం హైడ్రా చేస్తున్న కృషిని తెలంగాణ హైకోర్టు ప్రశంసలతో ముంచెత్తింది. చెరువుల అభివృద్ధిని హైడ్రా ఒక యజ్ఞంలా చేపడుతోందని, అందుకు నగరం నలుమూలల సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చెరువులే నిదర్శనమని కితాబిచ్చింది. ఈ మేరకు ఓ కేసు విచారణ సందర్భంగా సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, హైడ్రా పనితీరు అభినందనీయం. ముఖ్యం గా, ఒకప్పుడు ఆక్రమణలకు గురై, చెత్తకుప్ప లా మారి, పిచ్చిమొక్కలతో నిండిన బతుకమ్మకుంటను నేడు చూస్తే ముచ్చటేస్తోంది. అటు వైపు చూడాలంటేనే భయపడేలా ఉన్న ప్రాం తాన్ని, నేడు ఆహ్లాదాన్ని పంచేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరు హర్షణీయమన్నారు. బతుకమ్మకుంట అభివృద్ధి వల్ల కేవలం పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదం అందడమే కాకుండా, వరద ముప్పు తప్పింద ని, భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. గచ్చిబౌలిలోని మల్కం చెరువు అభివృద్ధి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ప్రస్తావించారు.
టీడీఆర్‌పై స్పష్టమైన విధానం ఉండాలి
మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాల భూమికి సంబంధించిన బదిలీ అభివృద్ధి హక్కుల టీడీఆర్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో భూములు, ఇంటి స్థలాలు కోల్పోతున్న యజమానులకు టీడీఆర్ కింద సరైన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనికోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన, సరైన విధానాన్ని రూపొందించాలి. పటిష్టమైన టీడీఆర్ విధా నం ఉంటే, చెరువుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవు, అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న సీనియ ర్ న్యాయవాది ఎస్. శ్రీధర్ కూడా న్యాయమూర్తి వ్యాఖ్యలతో ఏకీభవించారు. బతుక మ్మకుంట అభివృద్ధిని ప్రస్తావిస్తూ, అది హైడ్రా పనితీరుకు నిదర్శనమని కొనియాడా రు. తమ్మిడికుంటలో భూములు కోల్పోయిన తమ క్లయింట్లకు కూడా సరైన టీడీఆర్ అం దించాలని ఆయన న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.