15-12-2025 12:00:00 AM
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సన్మానం
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): హెచ్‌ఎండీఏలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ, అనేక సంవత్సరాల విరామం అనంతరం పరస్పర స్నేహాభివందనాలు పంచుకునే ఉద్దేశంతో సికింద్రాబాద్ పోలీస్ లైన్స్‌లోని పైగా ప్యాలెస్‌లోని పాత కార్యాలయంలో ఘనమైన సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హెచ్‌ఎండీఏలో సుమారు 423 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగు లు ఉండగా, వారిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కమిటీ, అద్భుతమైన సహకారం అందించినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంతకుముందు హెచ్‌ఎండీఏను హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌యూడీఏ)గా పిలిచేవారు. ఇది 2 అక్టోబర్ 1975న స్థాపించబడింది.
మూడు దశా బ్దాలకు పైగా సికింద్రాబాద్ పోలీస్ లైన్స్‌లోని పైగా ప్యాలెస్ ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. అనంతరం తార్నాక కాంప్లెక్స్, అమీర్పేటలో ఉన్న స్వర్ణజయంతి కాంప్లెక్సుకు కార్యాలయాన్ని మార్చింది. హెచ్‌యూడీఏ స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. హెచ్‌ఎండీఏ ఏర్పాటుతో దాని పరిధి మరింత విస్తరించింది. ప్రస్తుతం పైగా ప్యాలెస్ ఖాళీగా ఉండటంతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆ ప్రదేశం ఎంతో అనుకూలంగా మారింది.