20-08-2025 01:20:57 AM
రజనీకాంత్, కమల్‌హాసన్.. తమిళ చిత్ర పరిశ్రమకు రెండు పిల్లర్లు. ఈ నట దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపించి సుమారు అర్ధ శతాబ్ది కావస్తోంది. వీరిద్దరూ గతంలో అనేక సినిమాల్లో కలిసి నటించారు. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అల్భుత విలక్కుమ్’ వారిద్దరూ కలిసి నటించిన ఆఖరి చిత్రం. అయితే, 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రజనీ, కమల్ కలిసి ఓ సినిమాలో నటించనున్నారంటూ చాలా రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా తమిళ సినీవర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్న అభిమానుల కల త్వరలో నెరవేరనుందట. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇటీవల రజనీని హీరోగా పెట్టి తీసిన ‘కూలీ’ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతూ, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే లోకేశ్ మరో సినిమాకు సిద్ధమవుతున్నారట. ఇందుకు సంబంధించి స్క్రిప్టును సైతం సిద్ధం చేసుకున్నారట. ఇందులో రజనీ, కమల్ ప్రధాన పాత్రలు పోషిస్తారట. ఈ చిత్రంలో రజనీకాంత్, కమల్‌హాసన్ వృద్ధ గ్యాంగ్‌స్టర్లుగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోవిడ్‌కు ముందే ప్రారంభం కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నట ద్వయంతో కలిసి సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు లోకేశ్ ఇదివరకే చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు ఊపందుకున్నాయి. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌కేఎఫ్‌ఐ) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది టాక్.
ఇదే నిజమై, ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తే గనక కార్తీ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రకటించిన ‘ఖైది2’ సినిమాను ఇప్పట్లో పట్టాలెక్కించడం కుదరదు. మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరోవైపు లోకేశ్.. ఆమిర్‌ఖాన్ సినిమా చేయడానికి చర్చలు జరిపినట్టు టీమ్ ఇటీవల ధ్రువీకరించింది. ఏదేమైనా లోకేశ్ త్వరలో పట్టాలెక్కించే ప్రాజెక్టు అంటే, అది రజనీకాంత్ సినిమానే, మిగతా సినిమాలన్నీ పెండింగ్ లిస్టులోకి వెళ్లాల్సిందేననేది తమిళ చిత్ర పరిశ్రమ బలంగా చెప్తున్న ముచ్చట.