calender_icon.png 10 November, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు నెరవేర్చే శక్తి రేవంత్‌కు లేదు

19-05-2024 01:00:39 AM

సర్కారు హామీలు అమలుచేసేలా పోరాడుతాం

రాష్ట్రంలో అత్యధిక  లోక్‌సభ సీట్లు గెలుస్తున్నాం

సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

 యాదాద్రి భువనగిరి/హనుమకొండ, మే18 (విజయక్రాంతి): అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అలివిగాని హామీలిచ్చిందని, ఇప్పుడు వాటిని అమలుచేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసేదాకా వెంటపడి పోరాడు తామని ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భువనగిరి, హనుమకొండలో నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారాయని తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను దక్కించుకోబోతున్నామని చెప్పారు. విద్యావంతులు, మేధావులు బీజేపీకి అండగా ఉన్నారని పేర్కొన్నారు. 

మేమే ప్రత్యామ్నాయం

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయ మని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లనే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు తప్ప కాంగ్రెస్‌పై ఇష్టంతో కాదని అన్నారు. ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని పేర్కొన్నారు. పదేండ్లు కేసీఆర్ సాగించిన నియంత పాలనను ప్రజలు ఇప్పటికీ అసహ్యించుకొంటున్నారని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని కేసీఆర్‌కు ప్రజలు మళ్లీ ఏ విధంగా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి అండగా ఉండి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీకి 400 సీట్లు ఖాయం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి 400 సీట్లు గెలుస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలో కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ఎంపీగా ఆరూరి రమేష్ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. బ్యాంకులు నుంచి అప్పులు తీసుకుని రైతు రుణమాఫీ చేయాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణను దగా చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు.

భవిష్యత్‌లో తెలంగాణను రక్షించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, శ్రీధర్, ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, గంట రవికుమార్, బూర నర్సయ్యగౌడ్, పాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.