19-05-2024 01:00:10 AM
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల నుంచి కళాశాలల వరకు క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసి విద్యాసంస్థలను నిలబెట్టాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అధికారులు నిబద్ధతతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. జిల్లా యంత్రాంగంలో పరిపాలన లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సమయంలో విద్యుత్ శాఖలో నిర్లక్ష్యం కనిపించిందని అన్నారు. మాతా,శిశు ఆరోగ్య కేంద్రంలో తరచూ జరుగుతున్న తల్లి, పిల్లల మరణాల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ప్రసూన రాణి, డిప్యూటీ సీఈవో కే చంద్రశేఖర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.