10-11-2025 10:00:26 PM
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్
చండూరు (విజయక్రాంతి): చేనేత రుణమాఫీ చేయాలని, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20వ తేదీన హైదరాబాదులో కమిషనర్ కార్యాలయం దగ్గర జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చండూరు చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు రాపోలు వెంకటేశం అధ్యక్షతన చండూరులో నిర్వహించిన సమావేశంలో చేనేత కారుకుల మహా ధర్నా కరపత్రంను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలను వీధి పాలు జేసిందని ఆయన అన్నారు.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికుల ఋణ మాఫీ ప్రకటించి ఏడాది దాటినా లక్షల కోట్ల బడ్జెట్ లో కేవలం 48 కోట్ల రూపాయల చేనేత కార్మికుల ఋణ మాఫీ నేటి వరకు అమలు చేయలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. చేనేత కార్మికులకు ఋణాలు ఇచ్చిన బ్యాంకులు రుణాలు తీసుకున్న వారి పైన ఒత్తిడి తెస్తూ వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయని, సహకారోద్యమం స్పూర్తి మంట కలిసే విధంగా 12 సంవత్సరాల నుండి చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా, సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు మాఫీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు.
గతంలో లేని విధంగా షరతులు విధించి చేనేత పథకాల అమలులో అవినీతికి ఆస్కారం కల్పిస్తూ చేనేత కార్మికులకు అందని ద్రాక్షలా చేయడమేనన్నది సుస్పష్టం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన నాటి నుండి అనేక సందర్భాలలో అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం తరపున వినతి పత్రాలు అందజేసి చర్చలు జరిపినా, అనేక సమస్యలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయని అన్నారు.
చేనేత వస్త్ర పరిశ్రమ చేనేత కార్మికుల, చేనేత పారిశ్రామిక సహకార సంఘాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కాక తప్పటం లేదని చేనేత ఋణ మాఫీ, క్యాష్ క్రెడిట్ ఋణాలను మాఫీ చేయాలని, చేనేత భరోసా అమలు చేయాలని, చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 2025 నవంబర్ 20 వ తేదీన కమిషనర్ కార్యాలయం, నాంపలి, హైదారాబాద్ దగ్గర జరిగే మహా ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చేనేత బంధు మిత్రులకు చేనేత వస్త్ర పరిశ్రమ శ్రేయోభిలాషులకు, చేనేత కార్మికులకు, రాజకీయ పక్షాలకు తెలంగాణా చేనేత కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నదని అన్నారు.ఇంకా, ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు కర్నాటి వెంకటేశం గారు, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు గారు, చండూరు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బొల్ల జనార్ధన్, సభ్యులు వర్కాల విజయ్ కుమార్, ఏలె గణేష్, గుంటి యాదగిరి మరియు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.