calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి రైతు ద్రోహి

10-01-2026 12:00:00 AM

  1. కేసీఆర్ సంకల్పమే నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ
  2. ఆంధ్రాకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగును తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే..
  3. నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

నంగునూరు, జనవరి 9: తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, సిద్దిపేట గడ్డపై నేడు నూనె ఉత్పత్తి ప్రారంభం కావడం కేసీఆర్ సంకల్పానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు.

ఫ్యాక్టరీలోని అత్యాధునిక యంత్రాలను, క్రషింగ్ యూనిట్ పనితీరును స్వయంగా పరిశీలించిన ఆయన, ఉత్పత్తి అవుతున్న నూనె నాణ్యతను పర్యవేక్షించారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ...నూనె గింజల ఉత్పత్తిలో సిద్దిపేట స్వయం సమృద్ధి సాధించాలన్నది కేసీఆర్ కల అని గుర్తు చేశారు.

నాడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు నేడు నర్మెటలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని, జిల్లాలో 14,075 ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయని కొనియాడారు. ప్రస్తుతం ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ప్రారంభమైందని, పెండింగ్లో ఉన్న రిఫైనరీ యూనిట్ను కూడా వెంటనే ప్రారంభించి రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరేలా చూడాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేటకు వస్తే రేవంత్ రెడ్డిని నిలదీస్తాం..

కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వ్యవసాయ వ్యవస్థ అస్తవ్యస్తమైందని హరీశ్ రావు మండిపడ్డారు.వానాకాలం పంటకు సంబంధించి రూ. 600 కోట్ల బోనస్ పెండింగ్లో పెట్టారని, రెండేళ్లలో ఒక్క గజం కాలువ కూడా తవ్వలేదని విమర్శించారు.‘కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేదు, విద్యుత్ కష్టాలు లేవు.కానీ ఇప్పుడు ఎరువులకు కార్డులు, యాప్ల పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు.

దేవుడి మీద ఒట్టు వేసి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు.ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 22 వేల మందికి రుణమాఫీ కాలేదు‘ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈ ఫ్యాక్టరీ ప్రారంభానికి వస్తే, రుణమాఫీ కాని 22 వేల మంది రైతులతో కలిసి నిలదీస్తామని, రైతులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.

అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా?

ఎన్నికల ముందు రాహుల్ గాంధీతో కలిసి అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని,ఇప్పుడు పోలీసుల పహారాలో సినిమా టాకీస్లు ప్రారం భించడానికి వెళ్తున్నారని విమర్శించారు. దిల్సుఖ్నగర్ విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని, రే వంత్ రెడ్డికి దమ్ముంటే అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

కార్యక్రమంలో వేలేటి రా ధాకృష్ణశర్మ, వేముల వెంకటరెడ్డి, రాగుల సారయ్య, జాప శ్రీకాంత్ రెడ్డి,ఎడ్ల సోమిరెడ్డి, శ్రీహరి, దువ్వల మల్లయ్య, ఎల్లంకి మహిపా ల్ రెడ్డి, కోల రమేశ్‌గౌడ్, బద్దిపడగ కిష్టారెడ్డి, శనిగరం స్వాతి, ఇంగే నరేష్, బెదురు తిరుపతి, కర్ణకంటి వేణు, నిమ్మ శ్రీనివాస రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.