calender_icon.png 10 January, 2026 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీల భూములే రేవంత్ టార్గెట్

08-01-2026 01:06:50 AM

విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష

మాజీ మంత్రి- హరీశ్ రావు

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాల భూములే టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, యూనివర్సిటీలపై ఎందుకింత కక్ష అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ, భావితరాల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడం అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టుపెట్టి విధ్వంసం చేశారని, తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులన్నా, పరిశోధనలన్నా, పర్యావరణమన్నా ఎందుకింత చిన్నచూపు అని నిలదీశారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సింది పోయి.. ఉన్న విజ్ఞా న కేంద్రాలను బుల్డోజర్లతో కూల్చడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రభుత్వం ఈ చర్యలను ఆపాలని, యూనివర్సిటీల భూ ములను వాటికే వదిలేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు.