12-11-2025 07:43:00 PM
అవినీతికి అడ్డగా మారిన రెవిన్యూ కార్యాలయం..
వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): అక్రమ పట్టాలను రద్దు చేయాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ప్రభుత్వ భూములు గిరిజనేతరుల కబంధ హస్తాల్లో ఉన్నాయని పూనెంసాయి ఆరోపించారు. వెంకటాపురం మండలం మరికాల సర్వేనెంబర్ 9లో బడ గిరిజనేతరుల అక్రమ పట్టాలను రద్దు చేయాలని, జీఎస్పీ ఆధ్వర్యంలో తాసిల్దార్ వేణుగోపాల్ కి బుధవారం వినతి పత్రం అందజేశారు.
పూనెం సాయి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతమైన వెంకటాపురం మండలం మరికాల (జెడ్) సర్వే నెంబర్ 9లో 1/70 చట్టానికి విరుద్ధంగా వలస బడా గిరిజనేతరులకు రెవిన్యూ అధికారులు ఎలా? పట్టాలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. అక్రమార్కులతో అవినీతి అధికారులు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆయన అన్నారు. దొడ్డి దారిన పట్టాలు పొందేందుకు గిరిజనేతరులు ప్రయత్నాలు చేస్తుంటే వారికి అధికారులు కూడా వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూములను వారి సొత్తు చేస్తున్నారని ఆరోపించారు. అలా ఏజెన్సీ ప్రభుత్వ భూములు మొత్తం గిరిజనేతరుల కబంధహస్తాల్లోకి చేరుతున్నాయని విమర్శించారు.
మరికాల జెడ్ రెవెన్యూ రికార్డు ఆధారంగా సర్వే నెంబర్ 9లో ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం పరిధిలో ఉండాలని, కానీ రెవిన్యూ అధికారుల చేతివాటంతో ప్రభుత్వ భూమిని గిరిజనేతరులకి వారసత్వ భూములుగా రెవిన్యూ అధికారులు చిత్రీకరించారని ఆయన వాపోయారు. ఈ సమస్యను పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్ విచారణ జరిపి అక్రమ పట్టాలు రద్దు చేయాలని, అలాగే భూమిలేని ఆదివాసులకు ఆ భూమిని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పూర్తి వాస్తవ రికార్డ్ ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. జీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ తదితరులు వింత పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.