15-12-2025 07:47:29 PM
హనుమకొండ (విజయక్రాంతి): జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పారదర్శకంగా, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్మన్/జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జెఈఈ(మెయిన్స్) 2026లో ఎన్.టి.ఏ నేషనల్ టెస్టింగ్ ఎజన్సీ నిర్వహించనున్న జాతీయ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల సంస్కరణపై ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికకు అనుగుణంగా, ఎన్.టి.ఏ ద్వారా పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా, సురక్షితంగా నిర్వహించడానికి రాష్ట్ర, జిల్లా అధికారులతో సంస్థాగత అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించినందున, జనవరి 2026లో మొదటి సెషన్ జనవరి 21 నుండి 30 వరకు, రెండవ సెషన్ ఏప్రిల్ 2 నుండి 9 వరకు నిర్వహించే జెఈఈ(మెయిన్) 2026 పరీక్షల కోసం హనుమకొండ (జిల్లా)లోని 4 పరీక్షా కేంద్రాల ఆడిట్ నిర్వహణకు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించి నివేదికను సమర్పించలన్నారు.
కమిటీ సభ్యులు పోలీసు శాఖ డిసిపి రవి, ఏసిపి నర్సింహారావు, ఎన్.టి.ఏచే నామినేట్ చేయబడిన జిల్లా నోడల్ అధికారి జవహర్ నవోదయ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ కె. జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి.గిరిరాజ్ గౌడ్, ఈడిఎమ్ శ్రీదర్, కలెక్టరేట్ పాలన అధికారి గౌరీశంకర్లు సమన్వయంతో జిల్లాకు సంబంధించి ఎన్.టి.ఏ అందించిన జాబితా ప్రకారం పరీక్షా కేంద్రాలను సందర్శించి సమగ్ర, భౌతిక అడిట్ నిర్వహించాలన్నారు. ఆడిట్ పూర్తయిన అనంతరం ఫీడ్బ్యాక్ ఫారమ్ సమర్పించాలన్నారు. జిల్లాకు సంబంధించి ఆన్లైన్లో వరంగల్ జిల్లా కేంద్రంగా పరీక్షా కేంద్రాలు హనుమకొండ జిల్లాలో ఉండటం వంటి పలు సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని నివృత్తి చేయాలన్నారు.