08-08-2025 10:12:06 PM
కాంగ్రెస్ మాయమాటలతో గారడి చేస్తుంది..
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదే విజయం..
మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి..
ఖమ్మం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో ముంచి, పాలనను గాలికొదిలేసిందని భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావుతో మాట్లాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, ప్రపంచంలోని అగ్ర ఆర్థిక శక్తుల్లో నాలుగో స్థానానికి చేరిందని చెప్పారు. ఇది రాజకీయ నాయకత్వ సమర్థతకు నిదర్శనమన్నారు.
మోదీ ప్రజల మధ్యకు వచ్చి సేవకుడిగా ఉంటారు, కానీ మన రాష్ట్ర నాయకులకు అధికారమే పరమావధి. వాళ్లకు కుర్చీ ఫస్ట్, ప్రజలు నెక్స్ట్, దేశం లాస్ట్.' మాకు మాత్రం 'దేశమే మొదటి ఆదేశం'," అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని ఆయన అన్నారు. విద్యార్థుల హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం తమ ఊహల్లో విహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేటెల విద్యాసాగర్, గోంగూర వెంకటేశ్వరరావు, దొంగల సత్యనారాయణ, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య, సన్నీ ఉదయ్ ప్రతాప్, మండడపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.