03-01-2026 06:55:01 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థి దశనుండే రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలను భవిష్యత్తులో నిరోధించవచ్చని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎం సాయి చరణ్, వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణంలోని తక్షశిల, ఏకశిల, వెర్సాటైల్, కృష్ణవేణి పాఠశాల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు, పాటించవలసిన జాగ్రత్తలపై జిల్లా రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ట్రాఫిక్ నిబంధనలు పక్కగా పాటించడం, జీబ్రా క్రాసింగ్ లను వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్ అనుసరించడం, వాహనాలను ఓవర్టేక్ చేయడం, రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించవలసిన అంశాలు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగి నష్టాలు, అధిక దూరం ప్రయాణించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, శీతాకాలం వర్షాకాలం లలో రోడ్డుపై ప్రయాణించే సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై పిల్లలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, తేదీ జనవరి 1 నుండి 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల బస్సు డ్రైవర్లకు ఆల్కహాల్ బ్రీత్ అనాలిసిస్ పరీక్ష నిర్వహించారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పది కేసులు నమోదు చేశారు.