23-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట, జనవరి 22(విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం శనివారం పాల్వంచ డీఎస్పీ శ్రీ సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు సమాజంపై బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి చేతుల్లోనే సమాజ మార్పు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులుగా మీరు ఎదుగుతూనే, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి వారధులుగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాకుండా, బాధ్యతాయుత జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు ఉపయోగపడాలని అన్నారు.
ముఖ్యంగా రోడ్డు భద్రత విషయంలో విద్యార్థులు ఆదర్శంగా నిలవాలన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతతో ఎల్లప్పుడూ విధుల్లో నిమగ్నమై ఉండే డాక్టర్లు, పోలీస్ అధికారులు తమ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్ర మాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రశంసించారు. విద్యార్థులలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జీవితంలో సురక్షిత ప్రయాణం అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన అంశమని, వేగం కంటే గమ్యాన్ని క్షేమంగా చేరుకోవడమే నిజమైన విజయం అని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల ఎన్నో కుటుంబాలు అనాథలవుతున్నాయని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగుల్చుతుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభు త్వం చేపట్టిన 10 రోజుల ప్రత్యేక ‘అరైవ్ అలైవ్’ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువత చురుగ్గా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే బలవుతుందని, చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారిస్తాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు శిక్షల కోసం కాదని, ప్రజల ప్రాణాల రక్షణ కోసమేనని వివరించారు.
విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులలో కూడా ఈ అవగాహనను విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియట్ డీన్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని అన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, పోలీస్ అధికారులు కలిసి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ఇతరులకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.