23-01-2026 12:00:00 AM
భద్రాద్రిలో నేటి నుంచి వాగ్గేయకారోత్సవాలు
రామదాసు జయంతి సందర్భంగా ఐదు రోజులపాటు ఉత్సవాల నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థాన అధికారులు
నవరత్న కీర్తనలకు ప్రాణంపోసిన రామదాసు
భద్రాద్రి కొత్తగూడెం / భద్రాచలం, జనవరి 22, (విజయక్రాంతి): నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి... సీతమ్మకు చేయి స్తీ చింతాకు పతకమూ రామచంద్రా. అంత రామమయం జగ మంతా రామమయం అని కొని యాడినా, ఏ తీరుగనను దయజూసెదవో ఇన వంశోత్తమ రామా, అని కీర్తించినా, సీతమ్మకుజేయిస్తి చింతాకు పతకము రామచంద్రా.. నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా. అని ప్రశ్నించినా అది రామదాసుకే చెల్లింది. భజన సంప్ర దాయంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ఆయన ఇలా ఒకటి కాదు రెండు కాదు 300 కీర్తనలతో రాములోకి పద పట్టాభిషేకం చేశారు.
భద్రాచల క్షేత్రాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న పుష్కర కాలం కారాగృహవాసం గడిపి అప్పటి వరకు కంచర్ల గోపన్నగా ఉన్న ఆ రామభక్తుడు రామదాసుగా కీర్తించబడి దక్షిణ అయోధ్యగా భాసిల్లే భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి సన్నిధిలో మరో ప్రతిష్ఠాత్మక వేడుకకు సమయం ఆసన్నమైంది. నేటి నుండి ఈనెల 27 వరకు భక్త రామదాసు జయంతోత్సవాల సందర్భంగా ఆలయంలో వాగ్గేయకారోత్సవాలు జరగనున్నాయి. ఆలయ అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. భద్రాచల క్షేత్రంలో జరుగుతున్న వాగ్గేయకారోత్సవాలఫై విజయక్రాంతి అందిస్తున్న కథనం..
కీర్తనలకు ప్రాణంపోసిన రామదాసు..
అసమానమైన భక్తిప్రపత్తులతో శ్రీరాముడికి భద్రాచలంలో ఆలయనిర్మాణం చేయడమే కాకుండా శ్రీ రాముని సేవలో సంకీర్తనలలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. రామదాసు కీర్తనలు ఊరూరా ఆధ్యాత్మి క భావనలు నెలకొన్నాయి. భద్రాచలం క్షేత్ర మహత్మ్యాన్ని తలచుకునే ప్రతిసారి,భక్త రామదాసు గొప్పతనాన్ని చెప్పుకోక తప్పదు. తానీషా పాలన లో హసనాబాద్ (ప్రస్తుత పాల్వంచ) తహసీల్దార్ గా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న 1670లో నియమితులయ్యారు.
ఆయన 1674లో భద్రాచలం ప్రభుత్వ ఖజానాతో రాములోరి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. ఆ తర్వాత గోల్కొండ కారాగారంలో బందీ అయ్యాడు. ఆ సమయంలో స్వామిని వేల సంకీర్తనలతో కీర్తించిన భక్తరామదాసు తమ జీవిత కాలంలో అత్యధిక భాగం రామనామ సమ్మరణకే కేటాయించి తరించారు. ముఖ్యంగా రామ భక్తుడైనా భక్తరామదాస్ ఎన్నో కీర్తనలను స్వయంగా రాసి స్వామి వారికి సమర్పించారు.
సంకీర్తనలతో రామయ్యకు సేవ..
వాగ్గేయకారుల్లో భజన సంప్రదాయానికి ఆద్యుడైన అన్నమయ్య ఎన్నో వేల సంకీర్తనలు రచించి మోక్షమార్గం పొందారు. అదేబాటలో 17వ శతాబ్ధానికి చెందిన భద్రాచల రామదాసు భద్రగిరిపై శ్రీరాముడి కి గుడిగోపురాలు కట్టించడమే కాకుండా దాశరదీ శతకం రచించి తన జీవితం మొత్తం శ్రీరామచంద్రుని సేవలో గడిపారు. నూటికి వందకుపైగా కీర్తనలు భజన సంప్రదాయంలో పాడి తాను తరించి తరతరాల వారిని తరింపజేస్తున్నారు.
ఆయన జయంతి సందర్భంగా ఏటా భద్రాచలం రామాలయంలో ’వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తుంటారు. రామదాసు 393వ జయంతిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు సంగీత సాహిత్య సమ్మేళనం జరగనుంది. ఈనెల 23వ తేదీ నుంచి 27 వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
ఉత్సవాల చరిత్ర ఇదీ..
భద్రాచలం సీతరామచంద్రస్వామి దేవస్థాన పరిధిలో 1968లో ధర్మకర్తల మండలి ప్రారంభమైంది. 1973 నుంచి భక్తరామదాసు వాగ్గేయకారోత్సవాలు జరుగుతున్నాయి. నాడు ప్రఖ్యాత గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, వాణీ జయరాం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖులు తమ గానామృతంతో భద్రాద్రి రామయ్యను పరవశింపజేశారు. స్థానిక రంగనాయకుల గుట్టపై ఉన్న రామదాసు ధ్యాన మందిరం లో తొలినాళ్లలో వాగ్గేయకారోత్సవాలను నిర్వహించేవారు. అయితే ఆ మందిరం గుట్టపై ఉండటంతో భక్తులకు ఇబ్బందిగా ఉందనే కారణంతో ఉత్సవాల ప్రాంగణాన్ని కల్యాణ మండపం వేదిక వద్దకు మార్చారు. భద్రాద్రి దేవస్థానంలో నిర్వహించే వాగ్గే యకారోత్సవాలతో సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన తన శిష్యగ ణంతో తరచూ భద్రాద్రిలో నిర్వహించే వాగ్గేయకారోత్సవాలకు స్వయంగా వచ్చి పాల్గొనేవారు.
ఆయన రాముడిపై తనకున్న మక్కువను చాటుతూ నవరత్న కీర్తనలను రూపొందించారు.నాటినుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేదునూరి శిష్యు లైన మల్లాది బ్రదర్స్ నేటికీ కొనసాగిస్తుండం విశేషం. ఈ క్రమంలో వాగ్గేయకారోత్సవాల తొలి రోజున శ్రీరామదాసు నవరత్న కీర్తనల గోష్టి గానం నిర్వహిస్తున్నారు. భద్రాద్రి దేవస్థానం, హైదరాబాద్కు చెంది న శ్రీచక్రా సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ చారిటబుల్ట్రస్టు, విశాఖ పట్నానికి చెందిన నాదసుధా తరంగిణి కల్చరల్ ట్రస్టు, విజయవాడ సామగానలహరి కల్చరల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వ ర్యంలో ఈ వాగ్గేయకారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఒకే వేదికపై అఖండ బృందగానం..
రామదాసు కీర్తనలు భారతీయులకు అత్యంత విలువైన సంపద. వీటిని పరి రక్షించుకునేందుకు శాస్త్రీయ సంగీతం వృద్ధి చేసుకోవడానికి భద్రాద్రిలో జరిగే వాగ్గేయకారోత్సవాలు ఎంతగానో దోహ దపడతాయి. దేశం నలుమూలల నుంచి సుమారు 400మంది కళాకారులు భద్రాద్రి లో ఒకే వేదికపై అఖండ బృందగానం చేయడం విశేషం.