19-10-2025 07:20:39 PM
అధికారులు కన్నెత్తి చూడరు..
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు..
గమ్యం చేరేవరకు గగనమే.. ఎమ్మెల్యే సార్ ఈ రోడ్లపై లుక్కెయ్యండి..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. పెద్దముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల్లో రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయంతో వణికి పోతున్నారు. తప్పని పరిస్థితుల్లో గతుకుల రోడ్డులోనే ప్రయాణిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రధానంగా తాండూర్ పట్టణం విలియం మూన్ స్కూల్ నుండి హైదరాబాద్ రోడ్డు మార్గం గీత మందిర్ సమీపంలో రోడ్డు గుంతల మయంగా మారింది. వికారాబాద్ పట్టణం వరకు పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరానికి చేరుకోవాలంటే దాదాపు నాలుగు గంటల ప్రయాణం చేయాల్సిందే. ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎం సి హెచ్ ఆసుపత్రికి ఓ గర్భవతి మహిళ ఆటోలో వెళుతుండగా గుంతను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. దీంతో ఆమెతో పాటు ఉన్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి.
మరోవైపు పెద్దేముల్ మండలం ఘాజీపూర్ సమీపంలో బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద అప్రోచ్ రోడ్డు మట్టితో వేయడం వల్ల దాదాపు కిలోమీటర్ వరకు రోడ్డు గుంతలు, మెట్టలు దాటుకుంటూ గమ్యం చేరేవరకు బిక్కుబిక్కుమంటూనే ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలే ద్విచక్ర వాహనదారుడు గుంతను తప్పించబోయి రోడ్డుపై పడిపోయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదాలు నిత్యకృతంగా మారాయి. ద్విచక్ర వాహనాల ప్రయాణికులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే భయంతో వణికి పోతున్నారు. ఇక యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా నుండి మండల కేంద్రానికి వెళ్లే రహదారి సైతం రోడ్డుపై ఉన్న తారు కొట్టుకుపోయి మట్టి రోడ్డును తలపిస్తుంది. ఎడమ వైపు నుండి వెళ్లే వాహనాలపై కుడి వైపు వెళుతున్న వాహనాలు గుంతలను తప్పించబోయి ఒక్కసారిగా ఎడమ వైపు వస్తున్నాయని... ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని... ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఓ లుక్కేసి రోడ్లను బాగు చేయాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు.