30-07-2025 01:14:22 AM
చెన్నాపూర్ - కాప్రా రోడ్డు నిత్య నరకం రోడ్లు ఇలా.. వెళ్ళేది ఎలా ?
జవహర్ నగర్,జులై 29(విజయక్రాంతి): జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. చెన్నాపూర్ చౌరస్తా నుండి కాప్రా వైపు వెళ్లే ప్రధాన రహదారి దయనీయమైన స్థితిలో ఉంది. ఈ మార్గం ద్వార నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది, కానీ రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పడుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించడం అంటే ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఇక్కడి రోడ్లపై గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు చొటుచేసుకుంటున్నాయి.ఈ ప్రధాన రహదారి దుస్థితిపై కాప్రా రెవెన్యూ అధికారులు, ము న్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిరసనలు తెలిపినా అధికారులు స్పందించడంలేదన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఇక్కడి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానిక ప్రజా సం ఘాల నాయకులు విమర్శిస్తున్నారు.జవహర్ నగర్, బాలాజీ నగర్, చెన్నాపూర్, బీజేఆర్ నగర్, ఏకలవ్య నగర్ తో పాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు కాప్రా తహసీల్దార్ కార్యాలయానికి వె ళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. కాప్రా, కుషాయిగూడ , నేరేడ్ మెట్ వైపు వెళ్లేందుకు వేలాది మంది నిత్యం ఇక్కడి రాహాదారి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో భారీ గుంతలలో వర్షపు నీరు చేరి ఉండటంతోవాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ రహదారి మరమతులు చేపట్టి, రోడ్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.