30-07-2025 01:12:07 AM
కృష్ణమ్మ అందాలు కనువిందు
18 ఏళ్ల తర్వాత జూలైలో మొదటిసారి..
నాగార్జునసాగర్, జూలై 29: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయం గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి 13, 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత అధికారులు ఒక్కో గేటును ఎత్తుతూ మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 22 లక్షల ఎకరాలకు సాగునీరుతుందని చెప్పారు. జవహర్ కుడి కాలువ ద్వారా 11.74 లక్షల ఎకరాలు, లాల్ బహుదూర్ ఎడమ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో మొత్తం 6 లక్షల 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా, నల్లగొండ జిల్లాలో 1,50,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల 30 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్ష ఎకరాల ఆయకట్టుకు నాగా ర్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతున్నదని తెలిపారు. 2005లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు.
తాను ఆరుసార్లు ఎమ్మె ల్యేగా, ఒకసారి ఎంపీగా, ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా సాగర్ ద్వారా నీటిని వదలడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని, ఇందులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు.
సాగునీటితో పాటు నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా గడచిన 4 రోజులుగా 30,000 క్యూసెక్కుల నీటితో పూర్తిస్థాయిలో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కర్నాటి లింగారెడ్డి, పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొన్నారు.
18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకున్న గేట్లు
18 ఏళ్ల తర్వాత జూలై నెలలో నాగార్జునసాగర్ గేట్లు తెరవడం ఇదే తొలిసారి. సాధారణంగా సాగర్ గేట్లు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్‌లో మాత్రమే తెరచుకుంటాయి. ఈసారి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జూలైలోనే గేట్లు తెరిచారు. గతంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006, 2007 సంవత్సరాలలో జూలైలోనే సాగర్ గేట్లు తెరుచుకున్నాయి.
ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు జూలైలో గేట్లు తెరవడం విశేషం. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను మంగళవారం సాయం త్రం 6 గంటల వరకు 587.60 అడుగులకు చేరింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305.8626 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 2,55,811 టీఎంసీలుకాగా, ఔట్ ఫ్లో 2,47,213 టీఎంసీలుగా నమోదవుతున్నది.
సాగర్ వద్ద పర్యాటకులు సందడి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
తెరుచుకున్న ‘పులిచింతల’ గేట్లు
హుజూర్ నగర్(చింతలపాలెం): నాగార్జున సాగర్ నుంచి మంగళవారం 26 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలడంతో పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పెద్దగా లేకపో యినప్పటికీ భారీ వరద దృష్ట్యా అధికారులు గేట్లు ఎత్తారు. నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.