calender_icon.png 27 October, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోకో ఈజ్ బ్యాక్

26-10-2025 12:00:00 AM

రిటైర్మెంట్ వార్తలకు చెక్ 

సిడ్నీ, అక్టోబర్ 25: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలైనప్పటి నుంచీ కేవలం ఇద్దరి మీదే అందరి చూపు నిలిచింది. వారిద్దరూ ఎవరో కాదు అభిమానులు ప్రేమగా రోకో గా పిలుచుకునే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన వీరిద్దరూ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడ డమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో ద్వయం ఆసీస్ టూర్‌లో బాగా ఆడినా కూడా ప్లేస్ కష్టమేనంటూ చీఫ్ సెలక్టర్ చెప్పిన మాటలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య తొలి వన్డేలో ఇద్ద రూ ఫెయిలయ్యారు.

రెండో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీతో మెరిస్తే.. కోహ్లీ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యా డు. వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోవడమే కాదు భారత్ క్లీన్‌స్వీప్ పరాభవం ముంగిట నిలిచింది. దీంతో సిడ్నీ వేదికగా చివరి వన్డే రోకో జోడీకి మిగిలిన చివరి అవకాశంగా భావించారు. గతంలో తమ కెరీ ర్‌లో ఎన్నోసార్లు ఇలాంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితులను చూసిన రోహిత్, కోహ్లీ సిడ్నీ లో మాత్రం అదరగొట్టారు.

హిట్‌మ్యాన్ తన ఫామ్ కొనసాగిస్తూ సెంచరీతో చెలరేగితే.. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వరుసగా రెండు డకౌట్లు ఏ బ్యాటర్‌కైనా ఇబ్బందే. అందుకే కాబోలు క్రీజులోకి వచ్చి న తర్వాత తొలి సింగిల్ తీసినప్పుడు కోహ్లీ హ్యాపీగా ఫీలయ్యాడు. అటు రోహిత్ కూడా మునుపటి హిట్‌మ్యాన్‌ను గుర్తుకు తెస్తూ భారీ షాట్లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. కోహ్లీ కూడా ఎప్పటిలానే ఛేజింగ్‌లో క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

తాము ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో ఆసీస్ బౌలర్లకు మరోసారి రుచి చూపించారు. రోకో బ్యాటింగ్‌కు స్టార్క్, హ్యాజిల్‌వుడ్ సహా కంగారూ బౌలర్లందరూ చేతులెత్తేశారు. ఇక రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందంటూ వచ్చిన విమర్శలకు రోకో జోడీ తమ ఆటతోనే జవాబిచ్చి.. వీడ్కోలు వార్తలకు చెక్ పెట్టింది. అటు వరల్డ్‌కప్ ఆడాలన్న తమ ఆకాంక్షను కూడా బ్యా ట్‌తోటే సెలక్షన్ కమిటీకి వినించింది.

ఇదిలా ఉంటే కేవలం రోహిత్, కోహ్లీ కోసమే చివరి వన్డేకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 48 వేల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జరుగుతున్నది ఆస్ట్రేలియాలోనే అయినా ఎక్కువమంది భారత అభిమానులే కనిపించారు.