29-11-2025 01:31:09 AM
-బ్లింకిట్, జెప్టో గోదాముల్లో సోదాలు
-ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-76 కిలోల సరుకులు సీజ్...32 సంస్థలకు నోటీసులు జారీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): సమయం ఆదా అవుతుందని, ఇంటికే సరుకులు వస్తున్నాయని ఆన్‌లైన్ యాప్స్‌ల్లో ఆర్డర్లు పెడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..మనం తినే తిండి విషయంలో ఈ ఈ-కామర్స్ సంస్థలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలైంది. ప్రముఖ డెలివరీ యాప్స్ గోదాముల్లో నిర్వహించిన సోదాల్లో కుళ్లిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.
దిగ్గజ సంస్థలే దొంగలు..
తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు బ్లింకిట్ , బిగ్ బాస్కెట్ , జెప్టో , స్విగ్గీ ,అమెజాన్ ,ఫ్లిప్కార్ట్ ,వంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన వేర్‌హౌస్‌లు, స్టోర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారులకు పంపించేందుకు సిద్ధం గా ఉంచిన పండ్లు, కూరగాయల్లో చాలా వరకు కుళ్లిపోయి ఉన్నాయి. మరికొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయాయి. ఈ దాడుల్లో సుమారు 76 కిలోల కుళ్లిన కూరగాయలు, పండ్లు, కాలం చెల్లిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించి, వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేయించారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నందుకు గాను మొత్తం 32 సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ నోటీసులు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ మధ్య కాలంలో సామాన్యుడికి భారంగా మారాయి. ఓవైపు నాణ్యత లేని సరుకులు అంటగడుతూనే.. మరోవైపు స్విగ్గీ, జొమా టో, మ్యాజిక్పిన్ వంటి సంస్థలు ప్లాట్‌ఫామ్ ఫీజులు, డెలివరీ ఛార్జీలను భారీగా పెంచేశాయి. దీనికి తోడు తాజాగా డెలివరీ ఛార్జీల పై 18% జీఎస్టీ కూడా వర్తించనుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. డబ్బులు పోసి రోగాలు కొనుక్కున్నట్లు తయారైందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.