05-07-2025 04:26:40 PM
నేర ప్రవృత్తిని వీడకుంటే కఠిన చర్యలు..
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్..
మందమర్రి (విజయక్రాంతి): సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తన కలిగి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని, లేకుంటే కఠినమైన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(ACP Ravikumar) హెచ్చరించారు. సర్కిల్ కార్యాలయంలో శనివారం రౌడీషీటర్లకు నిర్వహించిన కౌన్సిలింగ్ లో ఆయన మాట్లాడారు. గతంలో చేసిన నేరాలను పక్కనపెట్టి, మంచిగా బ్రతకడానికి పొలీస్ శాఖ సహకరిస్తుందని, ఇదే సమయంలో ప్రవర్తనలో మార్పు రాకపోతే, కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రౌడీషీట్ లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి చట్టవ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. రౌడీ షీటర్ల మూలంగా వారి కుటుంబ సభ్యులు, పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, పోలీసుల పిల్లలు పోలీసులు అవుతు న్నారనీ, రౌడీ షీటర్ల పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తే వారు నేరస్తులుగా మారే ప్రమాదం ఉందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేర ప్రవృత్తిని వీడి సమాజ హితానికి కృషి చేయా లని సూచించారు. నేర ప్రవృత్తి ని వీడి, సత్ప్రవర్తనతో జీవించే వారికి పోలీసు శాఖ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రౌడీ షీటర్లలో సంపూర్ణ మైన మార్పు వస్తే, ఉన్నతాధికారుల సూచనల మేరకు రౌడీ షీట్ లను తొలగించే విషయాన్ని కూడా పరిశీలిస్తామని , గతాన్ని మరిచి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.