calender_icon.png 8 September, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయల్ రిడ్జ్ మోసం!

08-09-2025 12:00:00 AM

  1. రిసార్ట్స్ పేరుతో అమాయకులకు బురిడీ
  2. ఒక్కో గజం రూ.8వేలకు పైగానే..
  3. గుంటల్లో దర్జాగా రిజిస్ట్రేషన్
  4. వంత పాడుతున్న అధికార యంత్రాంగం
  5. జెండాలు పీకి చేతులు దులుపుకొని..
  6. ఫీల్డుకు వెళ్లి ఫొటోలతో కలరింగ్..
  7. అదనపు కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

నల్లగొండ, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలలు కనే అమాయకుల్ని తన కల్లబొల్లి మాటలు బురిడీ కొట్టిస్తున్నారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు అనుమతులే లేని వ్యవసాయ భూమికి.. నాలా కన్వర్షన్ చేసినట్టు.. అన్నీ అనుమతులు తీసుకున్నట్టు రంగురంగుల బ్రోచర్లతో కస్టమర్లను మోసగిస్తోందీ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ.

భువనగిరి మండలంలోని కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని 17, 38, 39,45 సర్వే నంబర్లలో ఆవీజీ డవలపర్స్ సంస్థ రాయల్ రిడ్జ్ రిసారట్స్ పేరుతో భారీ వెంచర్ను ఏర్పాటు చేసింది. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రీకాస్ట్ వాల్స్ను రాత్రికి రాత్రి ఏర్పాటు చేసి.. సదరు భూమిలో ఉన్న కొంగలకుంటను సైతం పూడ్చేసి భారీ వెంచర్కు తెరలేపింది.

నిజానికి రాయల్ రిడ్జ్ రిసార్ట్స్కు ప్రభుత్వం తరపు నుంచి ఏలాంటి అనుమతులు తీసుకోలేదు. సరికదా.. తమకు అన్నీ అనుమతులు ఉన్నాయనే రేంజ్లో రంగురంగుల బ్రోచర్లు ప్రింట్ చేయించి భారీగా ప్రచారం చేశారు. స్థానిక అధికారులకు సైతం అమ్యామ్యాలు ముట్టజెప్పి తమ బిజినెస్ను మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగిస్తోంది. అయితే సదరు భారీ వెంచర్ నిర్మాణంలో భాగంగా కొంగలకుంటను మట్టిపోసి పూడ్చివేయడంతో స్థానిక రైతులకు సంబంధించిన పంట పొలాలు నీరందక బీడు భూములుగా మారే పరిస్థితి కన్పిస్తోంది.

అదనపు కలెక్టర్కు టోకరా..

రాయల్ రిడ్జ్ రిసారట్స్ వ్యవహారంపై విజయక్రాంతి దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై యాదాద్రిభువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఆరా తీయడంతో పాటు విచారణ చేసి వెంచర్ను నిలిపివేయాలని సూచించినట్టు సమాచారం. అధికారులు సైతం క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఖాళీ జెండాలను పీకేశారు. ఆ సమయంలో ఫొటోలను దించి చర్యలు తీసుకున్నట్టు అదనపు కలెక్టర్కు కలరింగ్ ఇచ్చారు.

నిజానికి ఆ భారీ వెంచర్లో ఒక్క ఇటుకను కదిలించింది లేదు. కనీసం ఒక్క హద్దు రాయిని తొలగించలేదు. పైగా రిజిస్ట్రేషన్ చేయోద్దంటూ సబ్ రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ వెంచర్ యాజమాన్యం మాత్రం రోజూ తమ ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుతోంది. ఓవైపు హైడ్రా నీటి వనరులను పూడ్చి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఫలితంగా వందలాది మంది ఇండ్లు కోల్పోయి ఆర్థికంగా భారీగా నష్టపోయారు.

ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయితే తాజాగా హైదరాబాద్ను అనుకుని ఉన్న జిల్లా కేంద్రం కావడంతో భువనగిరి చుట్టుపక్కల భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి.. అక్రమార్కులకు వంత పాడుతుండడం కొసమెరుపు. అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం ఇచ్చినా.. ఇటు పంచాయతీరాజ్ అధికారులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ నోటీసులతో సరిపెట్టారే తప్ప.. చర్యలకు దిగడం లేదు.

గజం రూ.8వేలకు పైగానే..

భువనగిరి మండలం కూనూరు గ్రామపంచాయతీలో గజం రూ.5వేలకు మించి లేదు. కానీ ఆవీజీ డవలపర్స్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్ రిడ్జ్ రిసారట్స్ వెంచర్లో గజం రూ.8వేలకు పైగా విక్రయిస్తున్నారు. కార్నర్ బిట్, ఈస్ట్ ఫేజ్ ప్లాట్లకైతే రూ.10వేలకు పైనే. అయితే అన్నీ అనుమతులు ఉన్నాయంటూ రంగురంగుల బ్రోచర్లను చూసి కస్టమర్లు సైతం మోసపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తుండడం గమనార్హం.

వెంచర్ ఏర్పాటుపై స్థానిక పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరితే.. నోటీసులు ఇచ్చామని, జెండాలు తొలగించామని చెబుతున్నారు. మరీ విక్రయాలు జరుగుతున్నాయని అడిగితే.. మాకు సెలవు.. మా దృష్టికి రాలేదు. సబ్ రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చామంటూ కుంటిసాకులు చెబుతుండడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు వ్యవసాయ భూమిలో గ్రామపంచాయతీ పర్మిషన్ గానీ.

రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేస్తే.. మొత్తం వెంచర్ రూపురేఖలు లేకుండా చేయాల్సిందిపోయి.. దాటవేత ధోరణి అవలంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించినా.. అధికారుల ధోరణి ఇలాఉందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ప్రజలు మోసపోతున్నారని తెలిసినా.. అధికారులు నాన్చుడి ధోరణిపై ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటారా..? లేక షరా మాములుగానే వ్యవహరిస్తారా..? అన్నది వేచిచూడాలి.