23-01-2026 12:41:36 AM
కలెక్టర్‌కు ఆర్‌ఆర్‌ఆర్ బాధిత రైతుల విన్నపం
కడ్తల్, జనవరి 22: రీజినల్ రింగ్ రోడ్డు (గ్రీన్ రోడ్డు) నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మరింత పెంచాలని మర్రిపల్లి, ఎక్వయిపల్లి గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. గురువారం మర్రిపల్లి సర్పంచ్ ఈర్లపల్లి రవి ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ఉనికిని, జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతు న్నామని, ప్రభుత్వం ఇచ్చే పరిహారం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని రైతులు కోరారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమ కుటుంబాల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.
రైతుల విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్, ప్రభు త్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు 30 లక్షల నగదు పరిహారం అందజేయడం తో పాటు మైసిగండి ప్రాంతంలో 120 గజాల ప్లాటుతో పాటు, ప్రతి రైతుకు ’ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేస్తామన్నారు. వ్యవసాయ కుటుంబాల్లోని సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున అదనపు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
రోడ్డు సమస్యపై తక్షణ నిర్ణయం
మర్రిపల్లి నుండి కోనాపూర్ వరకు ఉన్న అధ్వాన్నపు రోడ్డు సమస్యను సర్పంచ్ రవి వివరించగా, కలెక్టర్ సానుకూలంగా స్పం దించారు. ఆ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించే బాధ్యత తనదని రైతులకు మాట ఇచ్చారు. కార్యక్రమంలో రైతు ప్రతినిధులు రంగారెడ్డి, శంకర్, శివ వెంకటయ్య, శ్రీన య్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.